TG DSC 2024 Exam: డీఎస్సీ పరీక్షలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్‌.. జులై 28కి విచారణ వాయిదా

|

Jul 19, 2024 | 8:37 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షను తక్షణమే నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం (జులై 18) విచారణ జరిగింది. అయితే పిటిషనర్లకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. పరీక్షల నిలిపివేతకు కోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది..

TG DSC 2024 Exam: డీఎస్సీ పరీక్షలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్‌.. జులై 28కి విచారణ వాయిదా
TG DSC 2024 Exam
Follow us on

హైదరాబాద్, జులై 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షను తక్షణమే నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం (జులై 18) విచారణ జరిగింది. అయితే పిటిషనర్లకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. పరీక్షల నిలిపివేతకు కోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది. పరీక్షలకు ప్రిపేర్ అవడానికి తగినంత సమయం ఇవ్వకుండానే ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తోందని ఇప్పటికే నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మొండి వైఖరితో పరీక్షలు వాయిదా వేయకుండా జులై 18 నుంచి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నిరసనగా దాదాపు 31 వేల మంది అభ్యర్ధులు తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోకుండా పరీక్షలను బహిష్కరించారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు.

ప్రిపేర్ అవడానికి సమయం తక్కువగా ఉందని, పరీక్షలకు సన్నద్ధం కావడానికి తగిన సమయం ఇవ్వలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. సిలబస్ కఠినంగా ఉందని, అభ్యర్థులు చదువుకోడానికి సరైన సమయం కూడా ఇవ్వలేదని, ఇది విద్యాహక్కు చట్టం నిబంధనలకు విరుద్ధమని కోర్టుకు తమ వాదనలు వినిపించారు. ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడానికి విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఈ సందర్భంగా కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్‌ పుల్లా కార్తిక్‌ కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

మరోవైపు జులై 18 నుంచి ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలు నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. వాదనలు విన్న కోర్టు పరీక్షలు నిలిపివేయడానికి నిరాకరించింది.. తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.