
తెలంగాణలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఫీజులు పెంచాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఫీజుల పెంపు విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఫీజుల నియంత్రణ కమిటీ (TAFRC)ను ఆదేశించింది. 6 వారాల్లోగా ఈ వ్యవహారంపై కమిటీ స్పష్టత ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు అమలవుతుందని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో సుమారు 11 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు గురువారం లంచ్ మోషన్ పిటిషన్ల రూపంలో హైకోర్టును ఆశ్రయించాయి. జస్టిస్ కె. లక్ష్మణ్ ఈ పిటిషన్లపై విచారణ జరిపారు. ఫీజుల పెంపు ప్రతిపాదనలు డిసెంబర్‌లోనే సమర్పించినా ఇప్పటివరకు నిర్ణయం రాకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి మూడేళ్లకోసారి కాలేజీలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నా TAFRC అలా చేయలేదని కోర్టు మండిపడింది. కమిటీలో 15 మంది సభ్యులు ఉన్నా.. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఎందుకు అని నిలదీసింది.
ఫీజుల పెంపు విషయాన్ని ముందే ఎందుకు వెంటాడలేకపోయారు? కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాతే పిటిషన్లు వేయడం ఎందుకు?’’ అంటూ కళాశాలలను కూడా కోర్టు ప్రశ్నించింది. కాలేజీల తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. ఫీజుల పెంపు ప్రతిపాదనలు డిసెంబర్‌లో సమర్పించామనీ. మార్చిలో TAFRC సమావేశమై వాటిని ఆమోదించిందని చెప్పారు. కానీ ప్రభుత్వం తరఫున న్యాయవాది మాత్రం, కొన్ని కాలేజీలు గతేడాది కంటే 70 నుంచి 90 శాతం వరకు భారీగా ఫీజులు పెంచాలని కోరుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు కాలేజీలు వేసిన పిటిషన్లను తిరస్కరిస్తూ..TAFRC ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి సిఫారసులు పంపాలంటూ ఆదేశించింది. ఈ తీర్పుతో ప్రస్తుతానికి విద్యార్థులు, తల్లిదండ్రులకు కొంత ఊరట లభించినప్పటికీ, ఫీజుల పెంపు తుది నిర్ణయం మాత్రం TAFRC, ప్రభుత్వాల చేతుల్లోనే ఉందన్నది గమనించాల్సిన విషయం.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.