హనుమకొండ, సెప్టెంబర్ 27: ఎట్టకేలకు డీఎస్సీ-2008 బాధితులకు న్యాయం జరిగింది. నేటి నుంచి వారందరికీ ధ్రువపత్రాల పరిశీలన మొదలైంది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబర్ 5 వరకు హనుమకొండలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని డీఈవో డి వాసంతి సెప్టెంబర్ 25న తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 274 మంది అభ్యర్థులు ఉన్నట్లు చెప్పారు. నాటి డీఎస్సీ అభ్యర్ధులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. కాంట్రాక్టు పద్ధతిలో వారిని ఉపాధ్యాయులుగా నియామకాలు చేస్తామని పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2008 డీఎస్సీ బాధితులకు ఆయా జిల్లా కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన నేటి నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ మినహా దాదాపు అన్ని జిల్లాల్లో కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు)గా వీరిని నియమించనున్నారు. దాదాపు 2,367 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబరు 5వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుంది. అనంతరం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు తీసుకునేందుకు అంగీకరిస్తున్నట్లు అధికారులు వారి వద్ద సంతకాలు తీసుకుంటారు. మెరిట్ ప్రాతిపదికన జాబ్ కేటాయిస్తారు. వీరికి వేతనం కింద నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నవంబరులో జరగనున్న డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ (రెగ్యులర్, బ్యాక్ లాగ్) సెమిస్టర్ పరీక్ష రుసుముకు సంబంధించి పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ ఎస్.నరసింహచారి, అదనపు అధికారి తిరుమలదేవి సెప్టెంబరు 26న ప్రకటన విడుదల చేశారు. అపరాధ రుసుం లేకుండా అక్టోబర్ 5 వరకు, రూ.50 అపరాధ రుసుంతో అక్టోబర్ 15 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఉద్యోగాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఎస్పీడీ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. కేజీబీవీల్లో 507 మంది బోధనా సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన, 97 మంది బోధనేతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎస్‌ఎస్‌ఏ ప్రకటన ఇచ్చింది. ఏడాది పాటు వీరి సేవలు వినియోగించుకోనున్నారు. అయితే కేజీబీవీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది దళారులు ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి మోసకారులను నమ్మొద్దని ఎస్పీడీ సూచించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారని, ఈ పోస్టులకు ఎలాంటి మౌఖిక, నైపుణ్య పరీక్షలు ఉండవని వెల్లడించారు.