
పెద్దపల్లి, జులై 8: ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులే కరువయ్యారు. కూలి పనులు చేసేవారు కూడా తమ బిడ్డలు ఉన్నతంగా చదవాలని ప్రైవేట్ బడుల్లో చేర్పించి నాలుగు ఇంగ్లిష్ ముక్కలు అబ్బేలా నానాతంటాలు పడుతున్నారు. అయితే ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఏ మాత్రం తీసిపోకుండా రానించగలరని ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు చూస్తే అవగతమవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్ధులకు ప్రోత్సహించడానికి తెలంగాణలోని పెద్దపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్కా రామ్‌కిషన్ రావు వినూత్న రీతిలో స్పందించారు.
ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఇద్దరు విద్యార్ధులను విమానం ఎక్కించి, విశాఖపట్నం పర్యటనకు తీసుకెళ్లారు. వారి అత్యుత్తమ ప్రదర్శనను పర్యాటక ప్రదేశాల పర్యటనతో అభినందించారు. ఆ ఇద్దరు టాపర్లు ప్రభుత్వ బడిలోనే చదివి అత్యధిక స్కోర్ సాధించారుమరీ.. బేగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన పాగల రసిత, శ్రీమంతుల రోహిత పదో తరగతి సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. రసిత 558, రోహిత 557 సాధించారు.
విద్యార్థుల ప్రదర్శనకు ముగ్ధుడై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్కా రామ్‌కిషన్ రావు తన సొంత ఖర్చులతో ఆదివారం వారిని విమానంలో విశాఖపట్నం పర్యాటక ప్రదేశాలను చూడటానికి తీసుకెళ్లారు. హెడ్ మాస్టార్ వినూత్న ఆలోచనకు అందరూ తెగ పొగిడేస్తున్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినందుకు బేగంపేట నివాసితులు రామ్‌కిషన్ రావు మాస్టారును అభినందించారు. విద్యార్థులను ఇలా ప్రోత్సహించడం ద్వారా పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించడానికి హెడ్ మాస్టార్ మల్కా రామ్‌కిషన్ రావు కూడా కృషి చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.