తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాల పిల్లల (సీడబ్ల్యూఎస్‌ఎన్) కువార్షిక పరీక్షల్లో పాస్ మార్కులను 35 నుంచి 20కి తగ్గించింది. ఈ విద్యాసంవత్సరం (2022-23) నుంచి ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే సీడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలకు నిర్వహించే పరీక్షల్లో 100కు 20 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లుగా పరిగణిస్తారు. అలాగే ఆటిజం, మానసిక వ్యాధులతో బాధపడేవారు 10 మార్కులు పొందితే ఉత్తీర్ణులైనట్లుగానే పరిగణించాలని విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ నవంబరు 7 ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యులేటర్ల అనుమతి. ప్రత్యేక జవాబు పత్రాల అందజేత. మూడు భాషా సబ్జెక్టుల్లో ఒక దానికి మినహాయింపు. అంటే తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో ఏదైనా ఒక దాన్ని చదవకుండా, పరీక్ష రాయకుండా మినహాయింపు. పరీక్ష ఫీజు చెల్లించనవసరం లేదు. 50 శాతం హాజరు ఉంటే పరీక్షలు రాయవచ్చవంటి పలు మినహాయింపులు కూడా ఇచ్చింది. పదో తరగతి చదివే పిల్లలు అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యేందుకే ఈ విధమైన వెసులుబాటు కల్పించినట్లు విద్యాశాఖ వెల్లడించింది.
ఉత్తీర్ణత మార్కుల తగ్గింపుతో పాటు వారికి మరికొన్ని మినహాయింపులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంధులు, చెవిటి, మూగ విద్యార్థులతోపాటు సెరిబ్రల్ పాల్సీ, తలసేమియా తదితర 21 విభాగాల్లోని ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది. సీడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలకు పరీక్ష రాసే సమయం గంటకు 20 నిమిషాల చొప్పున 60 నిమిషాలకు అంటే 4 గంటల వరకు పెంచారు. సాధారణ విద్యార్థులకు పరీక్ష సమయం 3 గంటలు మాత్రమే ఉంటుంది.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.