
హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఈఏపీసెట్ 2025కు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. రూ.250 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2,500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవల్సి ఉంటుంది. కాగా ఇప్పటి వరకు మొత్తంగా ఇంజినీరింగ్‌కు 2.16 లక్షలు, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగానికి 84 వేల చొప్పున దరఖాస్తులు వచ్చాయి.
మరోవైపు ఎస్సీ వర్గీకరణ ఇంకా పూర్తికకాపోవడంతో.. ఈఏపీసెట్ అధికారులు కేవలం ‘ఎస్సీ’ అని కాకుండా అన్ని కులాల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంజినీరింగ్‌కు ఎస్సీ కులాలన్నింటి నుంచి 25,300 దరఖాస్తులు, అగ్రికల్చర్‌కు 21,200 దరఖాస్తు వచ్చాయి. ముఖ్యంగా మాదిగ కులాల నుంచి ఇంజినీరింగ్‌కు 13,287, అగ్రికల్చర్‌కు 12,763 మంది దరఖాస్తు చేసుకున్నారు. మాల కులాల విద్యార్ధులు ఇంజినీరింగ్‌కు 30.31, అగ్రికల్చర్‌లో 25.10 శాతం మంది దరఖాస్తులు సమర్పించారు. ఇక ఏప్రిల్ 24వ తేదీ నాటికి మరికొన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది.
ఇక పరీక్షల విషయానికొస్తే.. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. రాత పరీక్షలను ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల ప్రకారం నిర్వహించనున్నారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మా కోర్సుల్లో విద్యార్ధులకు సీట్లు కేటాయిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.