
హైదరాబాద్, మే 12: తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీసెట్ ఫలితాలు ఆదివారం (మే 10) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈఏపీసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగాల ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో విడుదల చేసారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో మొత్తం 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,07, 190 మంది పరీక్షలు రాశారు. వీరిలో 1,51, 779 ఉత్తీర్ణత సాధించారు. అంటే ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. తాజా ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 73.88, బాలుర ఉత్తీర్ణత శాతం 72.79గా నమోదైంది. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో మొత్తం 81,198 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందులో 71, 309 మంది (87.82 శాతం) అర్హత సాధించారు. ఇందులో బాలికలు 88.32 శాతం, బాలురు 86.29 శాతం మంది అర్హత సాధించారు. కాడా ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరిగిన అగ్రికల్చర్ విభాగం, మే 2, 3, 4 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు జరిగాయి.
అయితే సాధారణంగా ఫలితాలు వెల్లడించిన మరుసటి రోజే ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తుంటారు. అయితే ఈసారి మరింత ఆలస్యంగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏకంగా జూన్ నెలాఖరు లేదా జులై మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు సైతం చెబుతున్నాయి. జూన్ 2న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడిన తర్వాత.. ఆ వెంటనే ఐఐటీలతోపాటు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్ మొదలవుతుంది.
మొత్తం నాలుగు విడతల జోసా కౌన్సెలింగ్ ముగిసిన తర్వాతే ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. సాధారణంగా ఈఏపీసెట్ కౌన్సెలింగ్ జోసా తర్వాతనే ఉంటుంది. లేదంటే ఇక్కడ చేరిన వారందరూ మళ్లీ జోసా కౌన్సెలింగ్‌లోకి వెళ్లిపోతారు. ఈక్రమంలో జూన్ నెలాఖరులో లేదా జులై మొదటి వారంలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభించనున్నారు. ఇక ఆగస్టు మొదటి వారంలో ఇంజినీరింగ్ తరగతులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.