
హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్, బీ ఫార్మసీ వంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో సీట్ల భర్తీకి ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈఏపీసెట్ 2026) నోటిఫికేషన్ త్వరలోనే విడుదలకానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే ప్రాథమిక షెడ్యూల్‌ను తయారు చేసిన విద్యా మండలి దానిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ప్రభుత్వ ఆమోదం ఇచ్చిన వెంటనే EdCET, LAWCET, ICET, PGECET, ECET, PECETలతో సహా పలు సెట్లకు సంబంధించిన వరుస నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
తాజా సమాచారం మేరకు తెలంగాణ ఈఏపీసెట్ 2026 పరీక్షలు 2026 మే 4నుంచి ప్రారంభంకానున్నాయి. మే 4 నుంచి 11 వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాదికి కూడా JNTU-హైదరాబాద్ ఆధ్వర్యంలోనే TG EAPCET 2026 పరీక్ష నిర్వహణ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. మిగిలిన CETలను వేర్వేరు యూనివర్సిటీలను కేటాయిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనుంది.
బీఈ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో 2026- 27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ సెట్ 2026కు కన్వీనర్‌గా జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ కే విజయ్‌కుమార్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈసారి కూడా ఈఏపీసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూకే అప్పగించారు. ఈ మేరకు కన్వీనర్‌గా విజయ్‌కుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా ఇతర సెట్లకు కూడా కన్వినర్లను నియమించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.