తెలంగాణ ఎంసెట్-2023కు ఈసారి భారీసంఖ్యలో దరఖాస్తులు అందాయి. దాదాపు 3.20 లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ఇంజినీరింగ్‌కు 2,05,075, అగ్రికల్చర్‌కు 1,15,189 మంది దరఖాస్తు చేశారు. ఇక ఏపీ నుంచి ఈసారి ఇంజినీరింగ్‌కు 51,427, అగ్రికల్చర్‌కు 20,731 మంది పోటీపడుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20కి పైగా పరీక్షా కేంద్రాలు పెరగనున్నాయి. ఈమేరకు పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది తెలంగాణలో 89, ఏపీలో 19 మొత్తం 108 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి పరీక్ష కేంద్రాల సంఖ్యను 130 వరకు పెంచే అవకాశం ఉంది. దీనిపై ఎంసెట్ కో కన్వీనర్ ఆచార్య విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, టీసీఎస్ ప్రతినిధులతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో పరీక్షా కేంద్రాల సంఖ్యను ఖరారు చేస్తామన్నారు.
ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఈసారి అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా పాత పరీక్షాకేంద్రాలతోపాటు కొత్తగా ఏర్పాటుచేస్తున్న వాటిలో కంప్యూటర్లన్నీ సవ్యంగా పనిచేస్తున్నాయో.. లేదో తెలుసుకుని వాటిని పరీక్షించామని టీసీఎస్ అయాన్ డిజిటల్ ప్రతినిధుల నుంచి హామీపత్రాన్ని తీసుకోవాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. స్క్వాడ్లు సైతం మొబైల్ ఫోన్లు పరీక్షాకేంద్రంలోకి తీసుకెళ్లకుండా ఈసారి కొత్త నిబంధన విధించనున్నారు. కాగా తెలంగాణ ఎంసెట్- 2023 పరీక్షలు మే 10 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఆయా కేంద్రాలున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయాలు లేకుండా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.