
హైదరాబాద్, జూన్ 14: రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో (పీజీ) ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వుడిత్యాల బాలకిష్టారెడ్డి శుక్రవారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ప్రకారం సీపీగెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 18వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఆగస్టు మొదటి వారంలో ప్రవేశ పరీక్షలు ఉంటాయి. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 297 కాలేజీల్లో పీజీ కోర్సులు, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
సీపీగెట్ ఎంట్రెన్స్ 2025 ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూహెచ్, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీల్లోని సీట్లను సైతం భర్తీ చేస్తారు.మొత్తం మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు నిండటంతో ఏపీ కోటా సీట్లకు ఈ ఏడాది నుంచి కోతపెట్టనున్నారు. గతంలో 15 శాతం సీట్లను ఏపీ విద్యార్ధులకు కేటాయించేవారు. ఇక నుంచి ఏపీ విద్యార్థులు నాన్‌లోకల్ కోటాలో మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. ఈ సారి నుంచి దివ్యాంగ విద్యార్ధులకు 5 శాతం రిజర్వేషన్ సైతం అమలు చేయనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.