తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మరోమారు భారీ ఎత్తున కొలువుల నియామకాలకు అనుమతి తెలిపింది. పోలీసు, బీసీ సంక్షేమ, రోడ్లు భవనాల శాఖల్లో కలిపి మొత్తం 7,029 కొత్త నియామకాలకు శనివారం (డిసెంబర్ 10) ఆమోదం తెలిపింది. వివరాల్లోకెళ్తే..
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలలో వివిధ కేటగిరీలలో దాదాపు 3,966 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలో శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు కొత్త పోలీస్ స్టేషన్లు, సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆయా స్టేషన్లలో ఖాళీలను అంచనా వేసి పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది.తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్ఠం చేసేందుకు నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది.
ఇక బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని మహాత్మా జ్యోతిబా ఫులె గురుకుల విద్యాసంస్థల్లో మరో 2,591 ఉద్యోగాల నియామకాలకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన 4 జూనియర్, 15 డిగ్రీ, 33 గురుకుల పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో అవసరమైన మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, గురుకులాలు పూర్తిస్థాయి సిబ్బందితో నడవాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలోని వివిధ విభాగాలకు సంబంధించి కొత్తగా 3 చీఫ్ ఇంజినీర్ పోస్టులు, 12 సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టులు, 13 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు, 102 డీఈఈ, 163 ఏఈఈ, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ తదితర పోస్టులకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది. దీంతో ఈ శాఖలో మొత్తం 472 అదనపు పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితోపాటు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టుల నియామక ప్రక్రియ, పదోన్నతుల ప్రక్రియను సైతం పూర్తి చేయాలని ఆదేశించింది. కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతుల కోసం రూ.1865 కోట్లను, ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా తక్షణమే పనులు చేపట్టేందుకు గాను రూ.635 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో మరమ్మతులు ఏడాదికి రూ.129 కోట్లు క్యాబినెట్ కేటాయించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.