Telangana Intermediate Board: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా విద్యాసంస్థలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు కోర్సుల్లో ప్రవేశాలను కూడా ముమ్మరం చేసింది. అంతేకాకుండా పలు ప్రవేశ పరీక్షలను సైతం నిర్వహిస్తూ వస్తోంది. కాగా.. ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్ ప్రక్రియ గడువును మరోసారి పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గడువు ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, కోఆపరేటివ్, గురుకులాలు, కేజీబీవీ, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలు, కాంపొజిట్ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందొచ్చని సూచించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలు చేపట్టాలని కోరారు.
కాగా.. కరోనా సెకండ్ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులను పై తరగతులను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. పదో తరగతిలో అందరినీ పాస్ చేయడం వల్ల ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌లో ఎక్కువ మంది చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును ఈనెల 30 వరకు ప్రభుత్వం పొడిగించడంతో అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
Also Read: