హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 28 (ఆదివారం) ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 87.79 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు టీజీఆర్‌డీసీ సెట్ కన్వీనర్ సైదులు ఓ ప్రకటనలో తెలిపారు. దాదానె 64 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 18,989 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 16,564 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.
మరోవైపు మహాత్మాజ్యోతిబాఫులే బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సీట్ల భర్తీకి కూడా 208 పరీక్ష కేంద్రాల్లో ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహించగా.. ఈ రాత పరీక్షకు 88.02 శాతం మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 47,463 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 41,775 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 15 పురుషుల, 15 మహిళా కాలేజీలు ఉన్నాయి. ఇక ఎస్సీ గురుకుల సొసైటీలో 26 మహిళా కాలేజీలు, ఎస్టీ గురుకుల సొసైటీలో 6 పురుషుల కాలేజీలు, 15 మహిళా కాలేజీలు ఉన్నాయి. టీఎస్‌ఆర్డీసీ సెట్ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా గురుకులాల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపులకు మే 6వ తేదీని చివరి తేదీగా నిర్ణయించినట్లు కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలని కోరారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.