Memory Tips: మీ పిల్లల జ్ఞాపకశక్తికి పదునుపెట్టే టెక్నిక్.. పుస్తకం పట్టిన 4 గంటల తర్వాత ఇలా చేయండి
How to Improve Memory Effectively: చాలా మందికి రోజు వారీ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు చదువు భారంగా అనిపిస్తుంది. పగలు, రాత్రి చదివినా క్షణాల్లో అంతా మర్చిపోతుంటారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలపై కోపంగా ఉంటారు. చదివినవి బాగా గుర్తుండాలని తమ పిల్లలను ఉదయం 4-5 గంటలకు నిద్రలేపి చదవడానికి, ఎక్సర్‌సైజ్‌లు చేయడానికి ప్రోత్సహిస్తుంటారు. అయితే పిల్లలు చదివిన వాటిని ఎలా సమర్థవంతంగా గుర్తుంచుకోవాలి అనే దానికి మరీ ఇంతగా ఒత్తిడి చేయవలసిన అవసరం లేదంటున్నారు నిపుణులు. దీనికి వ్యాయామం సరిపోతుందని అంటున్నారు. కాబట్టి వ్యాయామం జ్ఞాపకశక్తిని ఎలా పెంచుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

చదివిన కొన్ని గంటల తర్వాత వ్యాయామం చేయడం వల్ల జ్ఞాపకశక్తి గణనీయంగా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. తద్వారా చదివిన ప్రతిదాన్ని గుర్తుంచుకోగలుగుతారట. చదివిన నాలుగు గంటల తర్వాత శారీరక వ్యాయామం చేయడం వల్ల జ్ఞాపకశక్తి నిలుపుదల మెరుగుపడుతుంది. చదివిన వాటిని గుర్తుచేసుకునేటప్పుడు హిప్పోకాంపస్ నమూనా సారూప్యత పెరుగుతుంది. కరెంట్ బయాలజీ ఎ సెల్ ప్రెస్ జర్నల్‌లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం.. వ్యాయామం చదివిన వాటిని గుర్తుంచుకోవడంలో సహాయపడుతుందని వెల్లడిస్తుంది.
వ్యాయామం జ్ఞాపకశక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి నిర్వహించిన ఈ అధ్యయనంలో 72 మంది పాల్గొన్నారు. వీరిని మూడు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు చదివిన వెంటనే వ్యాయామం చేయమని అడిగారు. మరొక గ్రూపు చదివిన నాలుగు గంటల తర్వాత వ్యాయామం చేయమని అడిగారు. మూడవ గ్రూపు వ్యాయామం చేయవద్దని అడిగారు. 72 మందిని రెండు రోజులు పరీక్షించారు. ఇందులో చదివిన నాలుగు గంటల తర్వాత వ్యాయామం చేసిన వారికి ఉత్తమ ఫలితం వచ్చింది.
మనం ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు మన మెదడు జ్ఞాపకశక్తి జాడలను ఏర్పరుస్తుంది. ఇది కనెక్షన్‌లను బలోపేతం చేసే, ఏకీకృతం చేసే ప్రక్రియ. ఇలా వ్యాయామం చేయడం వల్ల మనం నేర్చుకున్న విషయం చాలా కాలం పాటు మెదడులో ఉండటానికి సహాయపడుతుంది. నేర్చుకున్న వెంటనే వ్యాయామం చేస్తే, శరీరం – మెదడు రెండూ చాలా సున్నితమైన స్థితిలో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో వ్యాయామం అంత ప్రభావవంతంగా ఉండదని పరిశోధనలో తేలింది. కానీ చదివిన కొన్ని గంటల తర్వాత వ్యాయామం చేయడం వల్ల మెదడు నేర్చుకున్న విషయాన్ని గుర్తుంచుకోవడానికి కొంత సమయం లభిస్తుంది. ఆ తర్వాత వ్యాయామం చేయడం శక్తివంతమైన బూస్టర్‌గా పనిచేస్తుంది. ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం, పోషకాలు, న్యూరోట్రాన్స్‌మిటర్‌లను మెదడుకు పంపుతుంది. ఇది అన్ని సమాచారాన్ని లాక్ చేయడంలో సహాయపడుతుంది. ఆ సమయంలో మనం చదివిన ప్రతిదీ గుర్తుకు వస్తుంది.
వ్యాయామం జ్ఞాపకశక్తిని ఎలా మెరుగుపరుస్తుందంటే?
నడక, జాగింగ్, సైక్లింగ్, డ్యాన్స్, ఏరోబిక్స్ మొదలైన వ్యాయామాలు మెదడు నుంచి ఉత్పన్నమయ్యే న్యూరోట్రోఫిక్ కారకం అయిన BNDF (బ్రెయిన్-డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్) విడుదలకు దారితీస్తాయి. ఇది మెదడుకు కొత్త న్యూరాన్‌లను పెంచడానికి, సంభాషించడానికి, బలమైన సినాప్టిక్ కనెక్షన్‌లను ఏర్పరచడానికి అవసరమైన ప్రోటీన్. ఇది కొత్త జ్ఞాపకాలను ఏకీకృతం చేసే, హిప్పోకాంపస్‌లో కొత్త న్యూరాన్‌ల పుట్టుకను ప్రోత్సహించే కీలక సిగ్నలింగ్ మార్గాలను సక్రియం చేస్తుంది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం శరీరంలో తక్కువ BNDF స్థాయిలు ఊబకాయం, మధుమేహం, కొన్ని సందర్భాల్లో గుండె జబ్బులకు దారితీస్తాయని వెల్లడైంది. BNDF స్థాయిలు ఎక్కువగా ఉంటే ఇది ఆకలిని తగ్గిస్తుంది. శక్తిని పెంచుతుంది. కణాలు, క్లోమమును రక్షిస్తుంది. ఈ BNDF మెదడుకే పరిమితం కాదు. ఇది వాపు, గ్లూకోజ్, జీవక్రియను కూడా నియంత్రిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మన జీవక్రియ ఆరోగ్యంతో నేరుగా కలుపుతుంది. శరీరం, మనస్సు మధ్య వారధిగా ఉన్న ఈ మూలకం మెదడును బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
చదివిన వెంటనే మెదడు సమాచారాన్ని నమోదు చేస్తుంది. తదుపరి వ్యాయామం ఆ వ్యవస్థీకృత జ్ఞాపకాలకు బలమైన పునాదిని అందిస్తుంది. కానీ 3 నుండి 4 గంటలు చదివిన తర్వాత మాత్రమే వ్యాయామం చేయడం ఉత్తమం. ఇది విద్యార్థులకు మాత్రమే కాకుండా కొత్త స్కిల్స్, భాషను నేర్చుకుంటున్న ఎవరికైనా సహాయపడుతుంది. ప్రతిరోజూ చదివిన తర్వాత కేవలం 20 నుంచి 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల శరీరాన్ని బలోపేతం చేయవచ్చు. అలాగే మెదడుకు శిక్షణ ఇవ్వవచ్చు. తద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ అభ్యాసం జ్ఞాపకశక్తిని గణనీయంగా పెంచుతుంది. ఆలోచనలకు పదునుపెడుతుంది. జ్ఞానం, నైపుణ్యాలను పెంచడంలో సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








