ఢిల్లీ, ఫిబ్రవరి 6: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ / రైఫిల్‌మ్యాన్ ఖాళీల నియామకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నియామకాలకు సంబంధించి దరఖాస్తు స్వీకరణ కూడా పూర్తయ్యింది. త్వరలో దేశ వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించనుంది. తాజాగా ఈ రాత పరీక్షకు సంబంధించిన పరీక్ష కేంద్రాల వివరాలు, అప్లికేషన్ స్టేటస్ వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి పరీక్ష కేంద్రం, అప్లికేషన్ స్టేటస్ వివరాలు చెక్ చేసుకోవచ్చు.
ఈ స్టేటస్ స్లిప్పులో రోల్ నంబర్, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు తదితర వివరాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల అవుతాయి. ఇక ఆన్‌లైన్ రాత రీక్ష ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12వ తేదీ వరకు జరుగనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలంకి చెందిన గోడి బాలుర గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. గురుకుల పాఠశాలలో ప్రవేశాలు పొందగోరే వారు ఫిబ్రవరి 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రవేశ పరీక్ష మార్చి 10న జరుగుతుందని ఆయన తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్మీడియట్ బైపీసీలో 40 సీట్లు, ఎంపీసీలో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆయన వివరించారు.
మరిన్ని తాజా విద్యా ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.