న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశ రక్షణ దళంలో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 27న విడుదలకావాల్సిన కానిస్టేబుల్ (జీడీ) నియామకాల నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) వార్షిక క్యాలెండర్ 2024-25 ప్రకారం ఆగస్టు 27న నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా.. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి. కాగా గతేడాది 46,617 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా భారీ సంక్‌యలోనే పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ కానున్నాయి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు నిబంధనల మేరకు శారీరక కొలతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎ, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా కింద సీట్ల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగిస్తూ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ రిస్ట్రార్ రాధికారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆగస్టు 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు అవకాశం కల్పించారు. అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని, ఈ అవకాశాన్ని వినియోగ పరచుకోవాలని ఆమె పేరొన్నారు. ప్రభుత్వ మెడికాల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశానికి మొత్తం 13,855 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో ఇప్పటి వరకు ఆరు వేల పైచిలుకు మంది దరఖాస్తులను పరిశీలించారు. మిగిలిన దరఖాస్తులను పరిశీలించాక ప్రాధాన్య క్రమాన్ని వర్సిటీ విడుదల చేయనుంది.
మరిన్ని విద్యా ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.