ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) భారీగా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో మొత్తం 8,773 జూనియర్ అసోసియేట్స్ (క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో 575 పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ) సర్కిల్‌లో 525 పోస్టులు, అమరావతి సర్కిల్‌లో 50 జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 17, 2023 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 7వ తేదీని దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విభాగంలో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 01, 2023 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్ 2, 1995 నుంచి ఏప్రిల్ 1, 2003 మధ్య జన్మించి ఉండాలన్నమాట. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ రాత పరీక్షలు), స్థానిక భాష నైపుణ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.19,900 చొప్పున జీతంగా చెల్లిస్తారు.
ప్రిలిమినరీ మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు – 30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ విభాగం నుంచి 35 ప్రశ్నలు – 35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు – 35 మార్కులకు పరీక్ష ఉంటుంది. గంట సమయంలో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తొలగిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే ప్రధాన పరీక్షకు ఎంపిక అనుమతిస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.