
హైదరాబాద్, నవంబర్ 28: రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల జారీ చేసిన నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (అండర్ గ్రాడ్యుయేట్) పోస్టుల దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు దరఖాస్తు గడువు నవంబర్ 27, 2025వ తేదీతో ముగిసింది. అయితే ఈ గడువును మరో వారంపాటు పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. తాజా నిర్ణయం మేరకు డిసెంబర్ 4, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటనలో తెలియజేసింది.
కాగా 2025 సంవత్సరానికి ఆర్‌ఆర్‌బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సెంట్రలైజ్‌డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేసింది. వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో 2,424-కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు, 394-అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, 163-జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, 77-ట్రైన్స్ క్లర్క్ పోస్టులు భర్తీ చేయనుంది.
ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు గడువు సమయంలోగా జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళా, ట్రాన్స్ జెండర్, మైనార్టీ లేదా ఈబీసీ అభ్యర్థులు రూ.250 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణతతోపాటు 2026 జనవరి 1వ తేదీ నాటికి అభ్యర్ధుల 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు ఉండాలి. స్టేజ్1, 2 ఆన్‌లైన్ రాత పరీక్షలు, కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు రూ.21,700, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు రూ.19,900, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు రూ.19,900, ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు రూ.19,900 చొప్పున జీతభత్యాలు చెల్లిస్తారు.
ఆర్‌ఆర్‌బీ రైల్వే ఎన్‌టీపీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.