Telangana Agriculture University: జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో 465 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
రాష్ట్రంలోని జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 465 సీట్ల భర్తీకి ఈ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..
హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో భర్తీ చేయనున్న 465 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో నవంబరు 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం సీట్లలో బీఎస్సీ వ్యవసాయం కోర్సులో 401 సీట్లు, బీఎస్సీ ఉద్యానంలో 54 సీట్లు, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌లో 5 సీట్లు, బీటెక్ ఆహార సాంకేతిక కోర్సులో 5 సీట్ల చొప్పున ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. కన్వీనర్ సీట్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీ ప్రవేశాలకు సంబంధించిన ఇతర పూర్తి సమాచారం అధికారిక వెబ్‌సైట్ www.pjtsau.edu.in లో చెక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేరే గడువు పెంపు.. ఎప్పటి వరకంటే
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి మూడో విడత కన్వీనర్ కోటా కింద రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పలువురు విద్యార్ధులు ఎంబీబీఎస్ సీట్లు పొందారు. ఆయా కాలేజీల్లో చేరే గడువును పెంచుతున్నట్లు తాజాగా విజయవాడని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెల్లడించింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు అభ్యర్థులు అక్టోబరు 28వ తేదీలోగా చేరాలని తెలిపారు. తాజాగా ఆ గడువును ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్ 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా చేరొచ్చని వర్సిటీ పేర్కొంది.
20 లక్షల ఉద్యోగాలు.. లోకేశ్ ఛైర్మన్‌గా మంత్రుల కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించి తగు సూచనలు చేసేందుకు మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఛైర్మన్‌గా మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, పి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్‌లను సభ్యులుగా నియమించింది. కూటమి సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సూపర్ సిక్స్‌లో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దశల వారీగా చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీపై తాజాగా ప్రభుత్వం దృష్టి సారించింది. భిన్నరంగాల్లో ఉద్యోగాల కల్పనకు గల అవకాశాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రుల బృందం అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.