హైదరాబాద్, నవంబర్ 10: పీవీ నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య యూనివర్సిటీ పరిధిలోని పలు కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ సీట్ల భర్తీకి నవంబర్ 11తో గడువు ముగియనుంది. రాజేంద్రనగర్, కోరుట్ల పశువైద్య కళాశాలల్లో బీవీఐసీ కోర్సులో ఎన్‌ఆర్‌ఐ, సెల్ఫ్‌ఫైనాన్స్ కోటా సీట్ల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థులు గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ శరత్‌చంద్ర ఓ ప్రకటనలో కోరారు. రాజేంద్రనగర్‌లో 3 ఎన్‌ఆర్‌ఐ, 2 సెల్ఫ్‌ఫైనాన్స్, కోరుట్లలో 3 ఎన్‌ఆర్‌ఐ, 2 సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్లలో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ప్రవేశార్హత, రుసుముకు సంబంధించిన వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందాలన్నారు. దరఖాస్తుల గడువు ముగిశాక.. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నవంబర్ 18న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
దేశవ్యాప్తంగా డిసెంబరులో జాతీయ పరీక్షల సంస్థ నిర్వహించే యూజీసీ నెట్‌లో మరో కొత్త సబ్జెక్ట్‌ను చేర్చారు. ఈ మేరకు ఆయుర్వేద బయాలజీని చేర్చినట్లు యూజీపీ ప్రకటించింది. జూన్‌లో జరిగిన పరీక్షలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సబ్జెక్టును ప్రవేశపెట్టగా తాజాగా ఆయుర్వేద బయాలజీని చేరింది. భారతీయ వైద్యశాస్త్రానికి ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో ఆయుర్వేద బయాలజీ చేర్చినట్లు యూజీసీ తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చని తెలిపింది.
తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మాప్‌అప్ రౌండ్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. వర్సిటీకి అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కాలేజీల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హులైన అభ్యర్థులు నవంబరు 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ సూచించారు.