UGC New Rules: ఇక నుంచి పీహెచ్‌డీ ఉంటేనే యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టులకు అర్హత ఉంటుంది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. ఇప్పటి నుంచి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హతతో యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరడం కుదరదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు యూనివర్సిటీల్లో, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను నేరుగా నియమించడానికి మాస్టర్ డిగ్రీతోపాటు నెట్‌లో అర్హత, పీహెచ్‌డీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే ఈ అర్హతలు ఉన్నవారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుండేది. ఇందులో నెట్ పాసైనవారికి ఐదు నుంచి పది మార్కులు వెయిటేజ్ ఇస్తుండగా పీహెచ్‌డీ చేసినవారికి 30 మార్కులు వెయిటేజీ ఇచ్చేవారు. 2018లో యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకాలపై యూజీసీ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇకపై వర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకానికి పీహెచ్‌డీ చేసినవారు మాత్రమే అర్హులని, ఈ నిబంధన అమలుకు మూడేళ్ళ సమయం ఇస్తున్నామని, 2021 నుంచి ఈ నిబంధనను తప్పకుండా అమలుచేస్తామని అప్పటి కేంద్రమంత్రి జవదేకర్ ప్రకటించారు.
ఇక కాలేజీల బోధన సిబ్బంది భర్తీకి మాస్టర్స్ డిగ్రీతోపాటు నెట్ లేదా పీహీచ్‌డీ ఉంటే చాలు. అంటే యూనివర్సిటీల్లో పోస్టల భర్తీకి, కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి యూజీసీ వేరువేరు అర్హతలను నిర్దేశించింది. కేవలం పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా పరిశోధనారంగంలోనూ ఆసక్తి చూపడానికి వీలుగా కాలేజీ లెక్చరర్లకు ఈ నిబంధన విధించారు. అలాగే గతంలోని అప్రైజల్ విధానం కాలేజీ లెక్చరర్ల పరిశోధనలను ప్రోత్సహించేదిగా ఉండేది. మారిన నిబంధనలతో కళాశాల అధ్యాపకులు బోధనపై మరింత దృష్టిసారించాల్సి ఉంటుంది. అదే సమయంలో వర్సిటీల్లో ప్రొఫెసర్లు అటు టీచింగ్ తోపాటు ఇటు రీసెర్చ్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన కొత్త పద్ధతులను యూజీసీ అమల్లోకి తెస్తోంది. అయితే కాలేజీ అధ్యాపకులకు పదోన్నతులు కల్పించేటప్పుడు బోధనా నైపుణ్యాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోనున్నారు.