NEET UG 2025 Exam Analysis: బాబోయ్‌.. కళ్లు బైర్లు కమ్మేలా నీట్ యూజీ పరీక్ష.. ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలకే ఫ్యూజుల్ ఔట్‌!

దేశ వ్యాప్తంగా జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్‌ 2025 ప్రవేశ పరీక్ష ఆదివారం (మే 4) ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ పరీక్షకు 22.7 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో దాదాపు 20.8 లక్షలకు పైగా విద్యార్ధులు పరీక్షకు హాజరైనట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఎలాంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో అత్యంత పటిష్ఠ భద్రత మధ్య ఈ పరీక్షను నిర్వహించింది..

NEET UG 2025 Exam Analysis: బాబోయ్‌.. కళ్లు బైర్లు కమ్మేలా నీట్ యూజీ పరీక్ష.. ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలకే ఫ్యూజుల్ ఔట్‌!
NEET UG 2025 Exam Analysis

Updated on: May 06, 2025 | 4:35 PM

హైదరాబాద్‌, మే 5: దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌తో సహా పలు మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్‌ 2025 ప్రవేశ పరీక్ష ఆదివారం (మే 4) ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య ఆఫ్‌లైన్‌ విధానంలో తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా 5,400కు పైగా పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష ఏకకాలంలో జరిగింది. దేశ వ్యాప్తంగా 22.7 లక్షల మంది ఈ సారి నీటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. అందులో దాదాపు 20.8 లక్షలకు పైగా విద్యార్ధులు ఈ పరీక్షకు హాజరైనట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఎలాంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో అత్యంత పటిష్ఠ భద్రత మధ్య ఈ పరీక్షను నిర్వహించింది. విదేశాల్లోనూ 14 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహణ దాదాపు అన్ని చోట్ల ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ కొందరు విద్యార్ధులకు మాత్రం పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్‌ ప్రక్రియ నమోదు విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వారంతా ఎన్‌టీఏకు ఫిర్యాదు చేశారు.

అన్ని చోట్ల కేంద్రాల్లోకి 11 గంటల నుంచే అనుమతిస్తున్నట్లు అధికారులు ప్రకటించినప్పటికీ గేట్స్‌ మూసివేసే సమయం వరకు అంటే మధ్యాహ్నం 1:30 గంటల వరకు.. ఇలా చివరి నిమిషం వరకూ రావడం కనిపించింది. గతేడాది నీట్‌ పేపర్‌ లీకేజీలతో దేశ మంతా అట్టుడుగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి ఎలాంటి పేపర్‌ లీకేజీలకు తావులేకుండా పటిష్ఠబందోబస్తుతో పరీక్షకేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించారు. పైగా గతేడాది జాతీయ స్థాయిలో 17 మంది విద్యార్థులు 720కు 720 మార్కులు స్కోర్‌ చేయడం పెద్ద దుమారమేలేపింది. అయితే ఈసారి 720కు 720 స్కోర్‌ చేసే సీన్‌ ఏ మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను చూస్తేనే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయ్‌మరి. 2016, 2017ల్లో ఈ తరహాలో ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చినట్లు నిపుణులు అంటున్నారు.

ఫిజిక్స్‌ చాలా టఫ్‌..

నీట్ 2025 ప్రశ్నాపత్రంలో ఫిజిక్స్‌ విభాగం అత్యంత కఠినంగా వచ్చింది. జేఈఈ మెయిన్స్‌ స్థాయికి దాటి ప్రశ్నలు అడగడం గమనార్హం. సాధారణంగా కోచింగ్‌ సెంటర్లలో కూడా ఈ తరహా ప్రశ్నలు బోధించరని, మాక్‌ టెస్ట్‌లలోనూ ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఫిజిక్స్‌ విభాగంలో ఏడు ప్రశ్నలు థియరీ విధానంలో జవాబులు గుర్తించేలా ఉన్నాయి. ఈ సారి థియరీ ఆధారంగా జవాబులిచ్చే ప్రశ్నలు ఒక్కటి కూడా లేవు. సుదీర్ఘమైన ప్రశ్నలు, ప్రతి దానికీ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేయాల్సిన పరిస్థితి రావడంతో అత్యధిక సమయం వాటికే కేటాయించవల్సి వచ్చినట్లు విద్యార్ధులు చెబుతున్నారు. అటు కెమిస్ట్రీలోనూ ఎన్‌సీఈఆర్‌టీ స్థాయిని దాటి ప్రశ్నలు ఉన్నాయని చెబుతున్నారు. ఐతే బయాలజీలో ప్రశ్నలు మాత్రం ఎన్‌సీఈఆర్‌టీ పరిధిలోనే వచ్చాయి. ఈసారి పేపర్‌ కఠినంగా ఉన్న నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే కటాఫ్‌లు బాగా తగ్గే అవకాశ ఉంటడమేకాదు.. 720 స్కోర్‌ చేయడం దాదాపు అసాధ్యం అంటున్నారు నిపుణులు. ఆన్సర్‌ కీ వస్తేగానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఫలితాలు జూన్ 14వ తేదీన వెల్లడించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.