NEET UG 2025 Last Date: నీట్‌ యూజీ పరీక్షకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్‌..

ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌ వంటి మెడికల్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందగోరే అభ్యర్ధులకు నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ యూజీ) 2025 పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ముగుస్తున్నాయి. నేటితో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారు చివరి అవకాశం సద్వినియోగపరచుకోవాలని..

NEET UG 2025 Last Date: నీట్‌ యూజీ పరీక్షకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్‌..
NEET UG 2025 Last Date

Updated on: Mar 07, 2025 | 4:01 PM

వైద్యరంగంలో కెరీర్‌ ప్రారంభించాలనుకునే వారికి చివరి అవకాశం. ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌ వంటి మెడికల్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందగోరే అభ్యర్ధులకు నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ యూజీ) 2025 పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ముగుస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి నీట్‌ యూజీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా నెల రోజులపాటు దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు. మార్చి 7వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కఠినమైన నీట్ పరీక్షకు యేటా లక్షలాది మంది హాజరవుతుంటారు.

గతేడాది ఏకంగా 24 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తుచేసుకున్నారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇక నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష మే 4న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మార్చి 7వ తేదీ రాత్రి 11.30 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీయే సూచించింది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తుది గడువు పెంచబోమని పేర్కొంది. నీట్‌ యూజీ 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీతో సైన్స్‌లో ఇంటర్మీడియట్/ ప్రీ-డిగ్రీ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి తప్పనిసరిగా 17 ఏళ్లు నిండి ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్థులు రూ.1700, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులు రూ.1600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్‌ జండర్‌ అభ్యర్థులు రూ.1000 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన అభ్యర్థులైతే రూ.9500 చెల్లించాలి. నీట్‌ యూజీ పరీక్ష ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్‌ విధానంలో (ఆఫ్‌లైన్‌) నిర్వహించనున్నారు. మొత్తం 180 నిమిషాలు (3 గంటలు) పాటు నీట్ రాత పరీక్ష ఉంటుంది. పరీక్ష సిలబస్‌, పరీక్ష విధానం, పరీక్ష కేంద్రం తదితర వివరాలు నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.