NEET PG 2024 Postponed: నేటి నీట్‌ పీజీ పరీక్ష వాయిదా.. పరీక్షకు కొన్ని గంటల ముందే ఊహించని ప్రకటన

|

Jun 23, 2024 | 8:16 AM

నీట్‌ యూజీ, యూజీసీ-నెట్‌ పరీక్షల వివాదం నేపథ్యంలో జాతీయ అర్హత పరీక్షలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో నీట్‌ పీజీ పరీక్షను కూడా కేంద్రం వాయిదా వేసింది. ఈ రోజు (ఆదివారం) పరీక్ష జరగాల్సి ఉండగా.. పరీక్షకు కేవలం కొన్ని గంటల ముందే శనివారం రాత్రి హడావిడిగా కేంద్రం ఈ మేరకు ప్రకటన వెలువరించింది. పలు పోటీ పరీక్షల సమగ్రతపై ఇటీవలి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నీట్‌ పీజీ పరీక్ష..

NEET PG 2024 Postponed: నేటి నీట్‌ పీజీ పరీక్ష వాయిదా.. పరీక్షకు కొన్ని గంటల ముందే ఊహించని ప్రకటన
NEET PG 2024 Postponed
Follow us on

న్యూఢిల్లీ, జూన్‌ 23: నీట్‌ యూజీ, యూజీసీ-నెట్‌ పరీక్షల వివాదం నేపథ్యంలో జాతీయ అర్హత పరీక్షలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో నీట్‌ పీజీ పరీక్షను కూడా కేంద్రం వాయిదా వేసింది. ఈ రోజు (ఆదివారం) పరీక్ష జరగాల్సి ఉండగా.. పరీక్షకు కేవలం కొన్ని గంటల ముందే శనివారం రాత్రి హడావిడిగా కేంద్రం ఈ మేరకు ప్రకటన వెలువరించింది. పలు పోటీ పరీక్షల సమగ్రతపై ఇటీవలి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నీట్‌ పీజీ పరీక్ష ప్రక్రియ పటిష్టతను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ సందర్భంగా పేర్కొంది. తదనుగుణంగా ముందు జాగ్రత్త చర్యగా జూన్‌ 23న జరగవల్సిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త తేదీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. ఈ మేరకు శనివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రకటన వెలువరించింది.

అయితే ఇప్పటికే విద్యార్థులు ఒకరోజు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో.. సకాలంలో వారికి పరీక్ష రద్దు విషయాన్ని చేరవేయడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ విఫలమైంది. దీంతో వారంతా ఆయా ప్రదేశాల నుంచి వెనుదిరగవల్సి వచ్చింది. విద్యార్ధులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు ఆరోగ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, పరీక్ష పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి అర్హతను నిర్ధారించేందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే నీట్-పీజీ ప్రవేశ పరీక్ష ప్రతీయేట నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 70 వేల పీజీ మెడికల్‌ సీట్లు ఉన్నాయి. వివిధ స్పెషాలిటీ కోర్జుల్లో ప్రవేశాలు పొందేందుకు నీట్‌ పీజీ 2024 పరీక్ష కోసం దాదాపు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్ష నిర్వహణకు అంతా సిద్ధం చేసి మరికొన్ని గంటల్లో పరీక్ష ప్రారంభం అవుతుందనంగా సడెన్‌గా నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన వెలువడటంతో విద్యార్ధులంతా గందరగోళానికి గురయ్యారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ మనీష్ జాంగ్రా కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పోటీ పరీక్షలను నిర్వహించడంలో వైఫల్యానికి గల కారణాలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా నీట్‌ పీజీ పరీక్షను ఎలా వాయిదా వేస్తారంటూ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.