హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ కోసం కటాఫ్ మార్కులు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మరోమారు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లను చేపట్టింది. ఎండీఎస్ సీట్లలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లను సెప్టెంబరు 22 సాయంత్రం ఆరు గంటలలోపు చేసుకోవాలని వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రోజు గడువు సమయం ముగిసేలోపు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్ధులకు సూచించారు. జనరల్ కేటగిరిలో కటాఫ్ మార్కులను 263 నుంచి 196కు తగ్గించగా.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరిలో 230 నుంచి 164కు తగ్గాయి. ఇక దివ్యాంగుల కోటాలో 246 నుంచి 164కు కటాఫ్ మార్కులు తగ్గించినట్లు వర్సిటీ అధికారులు వివరించారు.
తెలంగాణ సీపీగెట్ 2024 రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అసెప్టెంబర్ 27వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉచ్చారు. సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు అవకాశం కల్పిస్తారు. అక్టోబర్ 5న వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అక్టోబర్ 9న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 17వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సీపీగెట్ ర్యాంకు ఆధారంగా ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో 581 పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా (జీఆర్‌ఎల్)ను టీజీపీఎస్సీ తాజాగా వెల్లడించింది. ఈ పోస్టులకు ఈ ఏడాది జూన్‌లో రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 82,873 మంది అభ్యర్ధులు ఈ పరీక్ష రాశారు. సాధారణ సంక్షేమ వసతి గృహాలు, దివ్యాంగుల సంక్షేమ వసతి గృహాల్లో పోస్టులకు వేర్వేరుగా జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ (జీఆర్‌ఎల్)ను విడుదల చేసింది. దీనితోపాటు తుది ఆన్సర్ ‘కీ’ కూడా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. ఇతర పూర్తి వివరాల కోసం కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ అభ్యర్ధులకు సూచించారు.