National Overseas Scholarship: విదేశాలలో చదువుకోవాలనుకొనే వారికి స్కాలర్‌షిప్.. ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి..
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ(ఎంఎస్‌జేఈ) నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌నకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఫిబ్రవరి 15 నుంచి రిజిస్ట్రేషన్ల పోర్టల్ ఓపెన్ చేసింది.
పేద వర్గాల్లో విదేశీ విద్య అదొక కల. దేశం దాటి వెళ్లి పెద్ద యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు అభ్యసించాలంటే రూ. లక్షలు పోయాల్సిన పరిస్థితి. అంత స్తోమత లేక ఇక్కడ సర్దుకుపోయే వారు చాలా మంది ఉన్నారు. అయితే అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందించే ఓ పథకం ఉంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల చదువులకు అవసరమైన స్కాలర్ షిప్‌లను అందిస్తుంది. అసలు ఆ పథకం ఏమిటి? అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇదీ పథకం..
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఓఎస్) ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరంలో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లాలనుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేస్తుంది. మొత్తం 125 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ లభించనుంది. ఆసక్తి గల విద్యార్థులు 2023 మార్చి 31 అర్ధరాత్రి లోగా దరఖాస్తు చేసుకోవాలి. విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ లాంటి కోర్సులు చదవాలనుకునేవారు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేయొచ్చు. తక్కువ ఆదాయం ఉన్న షెడ్యూల్డ్ కులాలు, డీనోటిఫై చేసిన సంచార, పాక్షిక సంచార జాతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, సాంప్రదాయ కళాకారుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది.
రిజిస్ట్రేషన్లు ప్రారంభం..
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ(ఎంఎస్‌జేఈ) నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌నకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఫిబ్రవరి 15 నుంచి రిజిస్ట్రేషన్ల పోర్టల్ ఓపెన్ చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు అధికారిక వెబ్‌సైట్(nosmsje.gov.in)లో తమ ఫారమ్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ ఫిబ్రవరి 15 నుంచి 45 రోజులపాటు అంటే మార్చి 31 అర్ధరాత్రి వరకూ అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది. అయితే అప్లికేషన్ పెట్టే ముందు అధికారులు వెలువరించిన మార్గదర్శకాలను తప్పక పరిశీలించాలి.
ఎవరు అర్హులు..
ఎన్‌ఓఎస్ పథకం కింద, తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన విద్యార్థులు, షెడ్యూల్ కుల విభాగంలో ఉన్న విద్యార్థులు భారతదేశం వెలుపల మాస్టర్స్ డిగ్రీ లేదా పీహెచ్‌డీ కోర్సులను అభ్యసించడానికి స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2023-2024 విద్యా సంవత్సరానికి విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, పథకం కింద 125 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎస్సీ కేటగిరీ నుంచి 115 మంది విద్యార్థులు, డీనోటిఫైడ్, సంచార, అర్ధ సంచార జాతుల నుంచి ఆరుగురు విద్యార్థులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, సంప్రదాయ కళాకారుల కేటగిరీ నుంచి నలుగురిని ఎంపిక చేస్తారు.
ఇవి మర్చిపోవద్దు..
- దరఖాస్తు ప్రారంభం: 2023 ఫిబ్రవరి 15
- దరఖాస్తుకు చివరి తేదీ: 2023 మార్చి 31
- విద్యార్హతలు: పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీలో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులు 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేయాలి.
- వయస్సు: 2023 ఏప్రిల్ 1 నాటికి 35 ఏళ్ల లోపు
- కుటుంబ వార్షికాదాయం: రూ.8,00,000 లోపు
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.