అమరావతి, సెప్టెంబర్ 26: రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్ధులకు సైతం త్వరలో ‘జగనన్న గోరుముద్ద’ అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జగనన్న గోరుముద్ద పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, పొరుగు రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని అనుసరిస్తున్నట్లు మంత్రి బొత్స కొనియాడారు. ప్రస్తుతం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తోన్న ఈ పథకాన్ని త్వరలో ఇంటర్మీడియట్‌కు వర్తింప చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఆయన తెలిపారు. సోమవారం శాసనసభలో పలువురు సభ్యుల అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స బదులిస్తూ ఈ మేరకు తెలియజేశారు.
ఆంధప్రదేశ్ విద్యావ్యవస్థలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. నాడు – నేడుతో పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారాయని, ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, అమ్మఒడి పథకంతో డ్రాప్ అవుట్స్ సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కింద గత ప్రభుత్వం హయాంలో కేవలం రూ.2,729 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రభుత్వ ఈ నాలుగేళ్లలోనే రూ.6,268 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 20223-24 విద్యాసంవత్సరంలో సుమారు రూ.1,500 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్కో మండలానికి కనీసం రెండు ఉన్నత పాఠశాలలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఒకటి నుంచి 10 తరగతి వరకు చదివే విద్యార్థులకు అమలు చేస్తున్న గోరుముద్ద పథకాన్ని అదే స్కూల్‌లో చదివే ఇంటర్ విద్యార్థులకూ వర్తింప చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అన్నారు. అలాగే డీఎస్సీ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,960 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిల్లో 505 మంది పార్ట్‌టైమ్ విధానంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఆట స్థలాలు లేని ప్రైవేట్ పాఠశాలలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.