అమరావతి, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా వరంగల్ ఎన్‌ఐటీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ కొత్త మధుమూర్తిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మధుమూర్తి ఎన్‌ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొఫెసర్‌గా, పాలకమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం జాగర్లమూడిలో పుట్టి పెరిగిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం వరంగల్ ఎన్‌ఐటీలో ఎంటెక్, పీహెచ్‌డీ చేశారు. ఆయన తండ్రి కోటేశ్వరరావు ఆంధ్ర యూనివర్సిటీలో సివిల్ ప్రొఫెసర్‌గా, వరంగల్ ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాల (ఎన్‌ఐటీ) ప్రిన్సిపల్‌గా సేవలందించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పదవిలో మధుమూర్తి మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఉన్న రాంమోహనరావు ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న మధుమూర్తి రాష్ట్రంలో అస్తవ్యప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలకు సంబంధించి అనేక సవాళ్లు ఎదుర్కోవల్సి ఉంటుంది. ముందుగా రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమించాల్సి ఉంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తయినందున ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాల్సి ఉంది. అనంతరం వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఈఏపీసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్‌సెట్ వంటి అన్ని సెట్లకు కన్వీనర్లను నియమించాల్సి ఉంది. ఏ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఏ వర్సిటీకి అప్పగించాలనే నిర్ణయం తీసుకోవడంతోపాటు కన్వీనర్లను సైతం ఎంపిక చేయాల్సి ఉంది. అలాగే పరీక్షల నిర్వహణకు సంబంధించి టీసీఎస్‌తో సంప్రదించి.. పరీక్షల తేదీలను కూడా ఖరారు చేయాలి.
మరోవైపు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో దాదాపు 3,220 వరకు బోధన పోస్టుల ఖాళీగా ఉన్నాయి. వీటిని సైతం భర్తీ చేయాలి. గత ప్రభుత్వంలో ఈ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చినప్పటికీ కోర్టు కేసుల కారణంగా భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఆ న్యాయ వివాదాలన్నింటినీ పరిష్కరించి మళ్లీ భర్తీ ప్రక్రియ పట్టాలెక్కించాల్సి ఉంది. దీనికి ముందు పోస్టుల హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ రోస్టర్‌ను పూర్తి చేయాలి. ఈ సవాళ్లను ఆయన సకాలంలో పరిష్కరించగలరన్న నమ్మకంతో ప్రభుత్వం ఈ మేరకు ఆయనను ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.