బెంగళూరు, మే 10: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈసారి రెండు రాష్ట్రాల్లో భారీ ఉత్తీర్ణత నమోదైంది. ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన నాగసాయి మనస్వీ 599/600 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా కర్ణాటకలోనూ పదో తరగతి ఫలితాలు విడుదలవగా.. అందులో ఓ అమ్మాయి ఏకంగా 625/625 మార్కులు సాధించి అదరహో అనిపించింది. బాగల్‌కోట్ జిల్లాకు చెందిన అంకిత బసప్ప అనే విద్యార్ధిని 625 మార్కులకు గానూ 625 మార్కులు సాధించింది. దీంతో రాష్ట్రంలో అత్యధిక స్కోర్ సాధించిన ఏకైక విద్యార్ధిగా గుర్తింపు దక్కించుకుంది.
కర్నాటక పది ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకు కొట్టిన అంకిత బసప్ప కుటుంబ నేపథ్యం విషయాని కొస్తే.. తండ్రి బసప్ప రైతు కాగా, తల్లి గృహిణి. ముధోల్ తాలుకాలో ఉన్న మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలలో అంకిత చదువుతుంది. ఇంజినీరింగ్ పూర్తి, ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని మీడియాకు వెల్లడించింది. అంకిత విజయం రాష్ట్రం అంతటా మారుమ్రోగడంతో స్వగ్రామం వజ్జరమట్టిలోని స్థానికులంతా ఆమె ఇంటికి చేరుకొని బాలికను అభినందించారు. ఈ సందర్భంగా అంకిత మాట్లాడుతూ.. ‘తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వల్లే ఈ విజయం సాధించగలిగాను. ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించి సహకరించారు. ఈ విజయం వల్ల నా కన్నా వాళ్లే ఎక్కువ ఆనందంగా ఉన్నారు. ప్రీ-యూనివర్సిటీలో సైన్స్ అభ్యసించాలని, ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేశాక.. ఆపై ఐఏఎస్ అధికారిగా దేశానికి సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను’ అంటూ తెలిపింది.
టెన్త్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన అంకితను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బాలాకోట్ డిప్యూటీ కమిషనర్ కేఎం జానకి, జిల్లా పంచాయత్ సీఈవో శశిధర్ అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఫలితాల్లో దక్షిణ కన్నడకు చెందిన చిన్మయి 624, సహానా 624 మార్కులు సాధించారు. కర్ణాటకలో పదో తరగతి పరీక్షలు మార్చిలో జరిగాయి. దాదాపు 8.6 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవగా.. 6.31 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.