
హైదరాబాద్, జూన్ 2: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష దేశ వ్యాప్తంగా మే 18న జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తం 1,87,223 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 1,80,442 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. తాజా ఫలతాల్లో 54,378 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో 44,974 మంది అబ్బాయిలు, 9,404 మంది అమ్మాయిలు ఉన్నారు. సోమవారం (జూన్ 2) జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాలతోపాటు స్కోర్ కార్టులను కూడా ఐఐటీ కాన్పూర్ జారీ చేసింది.
అలాగే పేపర్ 1, పేపర్ 2 రెండింటికి సంబంధించి ఫైనల్ ఆన్సర్ కీలను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఢిల్లీ జోన్‌కు సంబంధించి రజిత్ గుప్తా.. 360 మార్కులకుగానూ 332 మార్కులు సాధించి ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. నిలిచాడు. అలాగే సాక్షమ్ జిందాల్ అనే మరో విద్యార్ధి కూడా 332 మార్కులు రావడంతో ఇద్దరిని టాప్ ర్యాంకర్లుగా ప్రకటించారు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాలు రావడంతో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ నిర్వహనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని అన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ మంగళవారం (జూన్ 3) నుంచి ప్రారంభంకానుంది.
ఈ ఏడాది జోసా మొత్తం ఆరు విడుతల్లో సీట్లను భర్తీ చేయనుంది. మంగళవారం నుంచే మొదటి విడత ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఇచ్చింది. జూన్ 14న మొదటి మొదటి రౌండ్, జూన్ 21న రెండో రౌండ్, జూన్ 28న మూడో రౌండ్, జూలై 4న నాలుగో రౌండ్, జూలై 10న ఐదో రౌండ్, జూలై 16న ఫైనల్ రౌండ్‌కు సంబంధించిన సీట్ల కేటాయింపు ఉంటుంది. కాగా ఈ ఏడాది ఐఐటీల్లో మొత్తం 17,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్‌ఐటీల్లో 24,229 సీట్లు, ట్రిపుల్ ఐటీల్లో 8,546 సీట్లు, గవర్నమెంట్ ఫండెండ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో 9,402 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. జోసా 2025 కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది మొత్తం 127 విద్యా సంస్థలు పాల్గొననున్నాయి. గత ఏడాది కంటే ఈసారి నాలుగు సంస్థలు ఇందులో అధికంగా ఉన్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.