
హైదరాబాద్, నవంబర్ 26: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ (మెయిన్–2026 తొలి విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు రేపటితో ముగియనున్నాయి. నవంబర్ 27 రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదేరోజు రాత్రి 11:50 గంటల్లోగా ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే డిసెంబర్ 1 నుంచి 2వ తేదీ రాత్రి 11.50 వరకు సవరించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.
జేఈఈ మెయిన్ సెషన్ 1 దరఖాస్తు సమయంలో తప్పుగా నమోదుచేసిన వివరాల సవరణకు గడువు ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వరు. ఒక్కసారి మాత్రమే వివరాలు సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులో అభ్యర్థి మొబైల్ నంబర్, ఈ-మెయిల్, అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ వివరాలు, అభ్యర్థి ఫొటోను మార్చడానికి అవకాశం ఉండదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అభ్యర్థి పేరు, తండ్రి పేరు,తల్లి పేర్లలో ఏదో ఒకటి మాత్రమే సవరించేందుకు అవకాశం ఇస్తారు. పదో తరగతి, 12వ తరగతి సంబంధిత వివరాలు, పాన్ కార్డు నంబర్, పరీక్ష రాయాలనుకొనే నగరం, మాధ్యమాన్ని మార్చుకొనేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాగే అభ్యర్థి పుట్టిన తేదీ, జెండర్, కేటగిరీ, సబ్ కేటగిరీ, సంతకం మార్చుకోవచ్చు. ఆధార్ కాకుండా ఇతర గుర్తింపుతో నమోదు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే తమ గుర్తింపు వివరాలను మార్చడానికి అనుమతి ఉంటుంది. ఆధార్ వివరాలు సవరించుకోవడానికి మాత్రం అవకాశం ఉండదు. ఈ విషయాలను అభ్యర్ధులు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా సవరించుకోవల్సి ఉంటుంది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్) 2026 రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జేఈఈ మెయిన్ మొదటి విడుత పరీక్ష రోజుకు రెండు సెషన్లలో జనవరి 21 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా ఎన్‌ఐటీ, ఐఐటీ, జీఎఫ్‌టీఐ వంటి ప్రతిష్టాత్మక ఇంజినిరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ఇన్‌స్టిట్యూట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ మెయిన్ పరీక్షలను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తుంది. తెలుగు, ఇంగ్లిష్ సహా హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతి, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మొదటి సెషన్‌లో పరీక్షలు రాసిన విద్యార్థులు రెండో సెషన్ పరీక్షలు కూడా రాయవచ్చు. రెండింటిలో బెస్ట్ ర్యాంకును అంతిమంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇక జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. పరీక్షకు వారం ముందు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదలకానున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.