
హైదరాబాద్, నవంబర్ 6: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత పొందేందుకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షకు ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్ధులు పోటాపోటీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈసారి ఎన్టీయే పరీక్ష కేంద్రాలను భారీగా పెంచింది. ఏపీలో 8, తెలంగాణలో 3 కొత్త నగరాలను ఇందులో అదనంగా చేర్చింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం.. కేంద్రాల్లో గతంలో పరీక్షలు జరిగేవి. ఇకపై వీటితోపాటు ఆదిలాబాద్, పెద్దపల్లి, కోదాడలోనూ జేఈఈ పరీక్షలు జరగనున్నాయి. దీంతో తెలంగాణలో పరీక్ష కేంద్రాల నగరాల సంఖ్య మొత్తం 14కి చేరింది. దేశ వ్యాప్తంగా మొత్తం 33 నగరాలను అదనంగా చేర్చినట్లు ఎన్టీయే వెల్లడించింది.
యేటా దాదాపు 14 లక్షల మంది పరీక్షలు ఈ పరీక్ష రాస్తున్నారు. ఆ సంఖ్యను మరింత పెంచాలని భావిస్తున్న ఎన్‌టీఏ ఈసారి మరిన్ని ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరీక్ష కేంద్రాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా కంప్యూటర్‌పై కనిపించే ప్రశ్నపత్రం ఫాంట్ సైజు పెంచుకోవడానికి, డయాగ్రామ్‌ల సైజ్‌ను కూడా పెంచుకొని చదువుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. జేఈఈ మెయిన్ 2026 తొలి విడతకు ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 27 వరకు కొనసాగనున్నాయి. తొలి విడత పరీక్షలు జనవరి 21 నుంచి 30 మధ్య జరుగుతాయి. ఫిబ్రవరి 12 నాటికి ఫలితాలు వెల్లడిస్తారు.
ఇక జేఈఈ మెయిన్ 2026 చివరి విడతలకు జనవరి ఆఖరి వారంలో దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ మధ్య పరీక్షలు జరుగుతాయి. తుది ఫలితాలు ఏప్రిల్ 20వ తేదీ నాటికి వెల్లడిస్తారు. 2024, 2025తోపాటు వచ్చే ఏడాది (2026) మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం 9-12 వరకు, మధ్యాహ్నం 3-6 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌తో సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. పేపర్ 1 పరీక్ష 300 మార్కులకు, పేపర్ 2 పరీక్ష 400 మార్కులకు ఉంటుంది.
జేఈఈ మెయిన్-2026 పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.