
హైదరాబాద్, ఫిబ్రవరి 25: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 సెషన్ 2 ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం (ఫిబ్రవరి 25)తో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యేటా రెండు సార్లు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు, జనవరి 30న పేపర్ 2 పరీక్ష జరిగాయి. ఇక తుది విడత రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 25వ తేదీ రాత్రి 9 గంటలతో ముగుస్తుంది. తొలి సెషన్‌లో సాధించిన పర్సంటైల్‌తో సంతృప్తి చెందని విద్యార్థులు మరింత మెరుగైన స్కోరు కోసం సెషన్ 2 పరీక్ష రాయవచ్చు. ఫిబ్రవరి 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష ఏప్రిల్ 1 నుంచి 8 మధ్య తేదీల్లో నిర్వహించనున్నారు.
దరఖాస్తుల్లో సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు నవంబర్ 28న రాత్రి 11.50 గంటల వరకు అవకాశం కల్పించారు. అయితే దరఖాస్తుల్లో సవరణలు చేసుకుంనేందుకు అదనపు ఫీజును చెల్లించాలి. జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తు సమయంలో వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ మార్పులకు అవకాశం ఇవ్వరు. ఒక్కసారి మాత్రమే వివరాలు సవరించుకునేందుకు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా వివరాలను సవరించుకోవాలని ఎన్టీఏ అధికారులు సూచిస్తున్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తులో అభ్యర్థి మొబైల్ నంబర్, ఈ-మెయిల్, అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్టు వివరాలు, అభ్యర్థి ఫొటోను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చడానికి అవకాశం ఉండదు. మిగిలిన వివరాలు అంటే.. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేర్లలో ఏదో ఒకటి మాత్రమే సవరించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పదో తరగతి, 12వ తరగతి సంబంధిత వివరాలు, పాన్ కార్డు నంబర్, పరీక్ష రాయాలనుకొనే నగరం, మాధ్యమాన్ని మార్చుకొనేందుకు ఛాన్స్ ఉంటుంది. అభ్యర్థి పుట్టిన తేదీ, జెండర్, కేటగిరీ, సంతకం కూడా మార్చుకొనేందుకు అవకాశం ఇస్తారు. ఇక జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ముగిశాఖ మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందొచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.