హైదరాబాద్, ఏప్రిల్ 22: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్ 2 ఫలితాల ప్రకటన తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. తాజా ప్రకటన ప్రకారం ఏప్రిల్ 25వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగగా.. ఇక రెండో విడత మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి 12 వరకూ నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మంచి ర్యాంకు కోసం మొదటి విడత మెయిన్‌కు రాసిన వారు కూడా తుది విడతలో పోటీ పడ్డారు. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కోర్‌కార్డ్ విడుదలైన తర్వాత, ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2024 ఆల్ ఇండియా ర్యాంక్‌లను ప్రకటిస్తుంది.
అంటే తొలి విడత, తుది విడతలో బెస్ట్ స్కోర్‌ను అంతిమంగా తీసుకుని దాని ప్రకారంగా ఆల్ ఇండియా ర్యాంక్ నిర్ణయిస్తారన్నమాట. రెండు విడతలకు కలిపి జేఈఈ మెయిన్‌లో బెస్ట్ స్కోర్ సాధించిన 2.5 లక్షల మందిని మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చే ర్యాంకు ఆధారంగా ఐఐటీలో సీట్లు కేటాయిస్తారు. జేఈఈ ర్యాంకు ఆధారంగా ఎన్‌ఐటీలు, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా జేఈఈ ర్యాంకును ప్రమాణికంగా తీసుకుంటారు. 2024లో నిర్వహించిన రెండు సెషన్‌లకు కలిపి దేశ వ్యాప్తంగా దాదాపు 24 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్‌లు వచ్చాయి.
జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీలలో దేశవ్యాప్తంగా 319 నగరాల్లో, దేశం వెలుపల 22 నగరాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.