TCS, Infosys Recruitments: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్.. పోటాపోటీగా ఉద్యోగాలు కల్పిస్తున్న టీసీఎస్, ఇన్ఫోసిస్..
దేశంలో ఐటీ(IT) పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తోంది. భారత కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఉద్యోగాలు కల్పించడంలోనూ రికార్డు సృష్టిస్తున్నాయి...
దేశంలో ఐటీ(IT) పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తోంది. భారత కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఉద్యోగాలు కల్పించడంలోనూ రికార్డు సృష్టిస్తున్నాయి. తాజాగా దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys Q4 Results) మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది. ఒక్క నాలుగో త్రైమాసికంలోనే కొత్తగా 22వేల మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు ఇన్ఫోసిస్ ఈ సందర్భంగా వెల్లడించింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల(Employees) సంఖ్య 3,14,015కు చేరినట్లు పేర్కొంది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 85 వేల మందిని ఫ్రెషర్లను నియమించుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 50వేల మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ నుంచి వేతనాలు పెంచుతున్నట్లు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
ఇటీవల నాల్గో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన టీసీఎస్ ఈ త్రైమాసికంలో కొత్తగా 35,209 మంది ఉద్యోగులకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. దీంతో ఆ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,92,195కు చేరుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి గరిష్ఠ స్థాయిలో 1,03,546 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇది ఆల్ టైమ్ రికార్డని పేర్కొంది. తమ కంపెనీ ఉద్యోగుల్లో 153 దేశాలకు చెందిన పౌరులు ఉన్నారని, మొత్తం 5.6 శాతం మంది మహిళలున్నట్లు కంపెనీ తెలిపింది. టీసీఎస్ తాజాగా మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Read Also.. Infosys Q4 Results: భారీగా పెరిగిన ఇన్ఫోసిస్ లాభాలు.. టీసీఎస్ కంటే మెరుగైన వృద్ధి నమోదు..