JEE మెయిన్ రాసిన వారికి గుడ్‌న్యూస్.. ఆర్మీలో అధికారులుగా చేరే అవకాశం! డైరెక్ట్ లింక్ ఇదే
ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (PCM)తో కనీసం 60 శాతం మార్కులు సాధించి, జేఈఈ మెయిన్-2026 పరీక్షకు హాజరైన అవివాహిత పురుష అభ్యర్థులకు భారత సైన్యం శుభవార్త అందించింది. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-57) ద్వారా 90 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారికి నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్య, సైనిక శిక్షణతో పాటు శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదాలో శాశ్వత కమిషన్ లభిస్తుంది..

భారత సైన్యంలో అధికారి హోదాలో ఉద్యోగం సాధించాలనుకునే యువతకు మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-57) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (PCM) సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, జేఈఈ మెయిన్-2026 పరీక్షకు హాజరైన అవివాహిత పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎంపికైన వారికి నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్ విద్యతో పాటు సైనిక శిక్షణ అందిస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసినవారికి ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు భారత సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో శాశ్వత కమిషన్ లభిస్తుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 లేదా తత్సమాన పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే జేఈఈ మెయిన్-2026 పరీక్షకు హాజరై ఉండటం తప్పనిసరి. అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి 2027 జులై 1 నాటికి వయసు కనీసం 16.5 ఏళ్లు, గరిష్ఠంగా 19.5 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు 2008 జనవరి 1 కంటే ముందు, 2011 జనవరి 1 తర్వాత జన్మించి ఉండకూడదు. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న జనన తేదీల నిబంధనలను పరిశీలించాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 12, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపికలో జేఈఈ మెయిన్ స్కోరుకు ప్రాధాన్యం ఉంటుంది. అర్హత సాధించినవారిని తదుపరి దశలో సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (SSB) ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇందులో స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అనంతరం వైద్య పరీక్షల ద్వారా తుది ఎంపిక ప్రక్రియ పూర్తిచేస్తారు. ఎంపిక విధానం, షార్ట్‌లిస్టింగ్ ప్రమాణాలపై పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో తెలుసుకోవాలి.
TES-57లో ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్ విద్యతో పాటు సైనిక శిక్షణ అందిస్తారు. మొదటి మూడేళ్లలో ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్, బీటెక్ సాంకేతిక శిక్షణ నిర్వహిస్తారు. ఇందుకోసం పుణెలోని కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజినీరింగ్ (CME), సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (MCEME) తదితర శిక్షణా కేంద్రాల్లో కేటాయించిన విధంగా శిక్షణ ఇస్తారు. అనంతరం నాలుగో ఏడాది దేహ్రాదూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో శిక్షణ కొనసాగుతుంది. కోర్సు, శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు బీఈ/బీటెక్ ఇంజినీరింగ్ డిగ్రీ ప్రదానం చేస్తారు. అనంతరం భారత సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో శాశ్వత కమిషన్‌పై నియమిస్తారు. శిక్షణ సమయంలో నిబంధనల ప్రకారం నెలకు రూ.15,500 స్టైపెండ్ అందిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసి లెఫ్టినెంట్ హోదాలో నియమితులైన తర్వాత పే మ్యాట్రిక్స్‌లోని లెవల్-10 ప్రకారం నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు మూలవేతనం లభిస్తుంది. దీనికి అదనంగా వర్తించే డియర్నెస్ అలవెన్స్ (DA), ఇతర అనుమతించబడిన భత్యాలు, సైనిక సేవా ప్రయోజనాలు అందుతాయి. వాస్తవ వేతనం, భత్యాలు సంబంధిత నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. ఇంటర్మీడియట్ తర్వాతే ఇంజినీరింగ్ విద్యతో పాటు సైన్యంలో అధికారి హోదాలో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే యువతకు TES-57 మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు వివరాలు
- కోర్సు పేరు: 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-57)
- ప్రారంభం: జులై 2027
- మొత్తం ఖాళీలు: 90
- దరఖాస్తు విధానం: ఆన్లైన్
- చివరి తేదీ: నవంబరు 12, 2026
ఆర్మీలో లెఫ్టినెంట్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




