భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేసింది. అగ్నిపథ్ స్కీంలో భాగంగా ఎయిర్ ఫోర్స్‌లోనూ అగ్నివీర్ నియామకాలు చేపడుతున్నారు. అగ్నివీర్ వాయు(01/ 2026) ఖాళీల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్ధులు ఐఏఎఫ్ ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు స్వీకరణకు జనవరి 27, 2025వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ వాయు(01/ 2026) బ్యాచ్ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్‌తో మొత్తం 50% మార్కులతో, ఆంగ్లంలో 50% మార్కులతో 2 సంవత్సరాల వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక దారుఢ్య, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయోపరిమితి జనవరి 01, 2005 నుంచి జులై 01, 2008 మధ్య జన్మించి ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జనవరి 27, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 7, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ పరీక్ష ఫీజు కింద రూ.550 తప్పనిసరిగా చెల్లించాలి. ఫేజ్-1 (ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3 (మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.