దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 జీడీఎస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం ఆప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడంతో తప్పులు దొర్లిన వారు వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం దొరికినట్లైంది. ఇక ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే.. కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తపాలా శాఖ ఈమెయిల్ ద్వారా లేదంటే ఫోన్ నంబర్‌కు మెజేస్, పోస్టు ద్వారా అందిస్తుంది. అలాగే అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపిక జాబితాను కూడా పొందు పరుస్తారు. విడతల వారీగా అభ్యర్ధుల ఎంపిక జాబితాను విడుదల చేస్తారు. మొదటి సెలక్షన్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా ఏదైనా కారణంతో విధుల్లో చేరకపోతే.. ఆ పోస్టులను రెండో లిస్టులో చేర్చి, ఖాళీలను భర్తీ చేస్తారు. ఇక రెండో లిస్టులోనూ ఖాళీలు ఏర్పడితే మూడో లిస్టు, దీనిలోనూ చేరకపోతే నాలుగో లిస్టు ద్వారా భర్తీ చేస్తారు.
గతేడాది కూడా నాలుగు సెలక్షన్ లిస్టులు వచ్చిన సంగతి తెలిసిందే. టెన్త్ మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా అభ్యర్థి ఎంపిక చేసుకున్న బ్రాంచీ, హోదా, ప్రాధాన్యం ప్రకారం ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మొత్తం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ జనరేటెడ్ పద్ధతిలో జరుగుతుంది. పదో తరగతి మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి.. ఎంపిక చేస్తారు. గతేడాది (2023)కి సంబంధించి ఫిబ్రవరి 2తో దరఖాస్తులు ముగియగా.. మార్చి 11వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు 20 రోజుల తర్వాత ఫలితాలు వచ్చాయి. దీనిని బట్టి చూస్తే 2024 ఏడాదికి సంబంధించి ఫలితాలు ఆగస్టు నెలాఖరులో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. మెరిట్ జాబితా విడుదలైన తర్వాత అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇందుకు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.