Free Coaching: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని సరికొత్త విధానానికి తెరలేపింది. టెట్(టీచర్ ఎలిజిలిబులిటి టెస్ట్) కోసం సిద్ధమవుతున్న యువతకు ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అభ్యుదయ కోచింగ్ తరహాలో, ఇప్పుడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు.
ఇదే సమయంలో ప్రజా సేవ చేయాలనే పట్టుదల ఉండి, ఆర్థిక స్థోమత లేని విద్యార్థుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అభ్యుదయ కోచింగ్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. ఈ అభ్యుదయ కోచింగ్ సెంటర్లలో ఐఏఎస్, ఐపీఎస్ సహా అన్ని సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కోచింగ్ ఇస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మొదలు, ఎంపిక వరకు ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థులకు క్షుణ్ణంగా శిక్షణ అందిస్తారు. లక్ష్య సాధనకు అవసరమైన మార్గనిర్దేశం చేస్తారు. ఇదే తరహాలో ఇప్పుడు డైటింగ్, టీఈటీ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఉచిత శిక్షణకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
బ్యాచ్‌కు 120 మంది విద్యార్థులు..
ఉత్తరప్రదేశ్‌లోని జిల్లా టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ పవన్ సచ్చన్ తెలిపిన వివరాల ప్రకారం.. “టిఈటీ అభ్యర్థుల కోసం ఆఫ్‌లైన్ మోడ్‌లో కోచింగ్ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కోచింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అయితే, కరోనా వ్యాప్తి తగ్గకపోతే ఆన్‌లైన్ విధానంలో కోచింగ్ నిర్వహిస్తాం. ఒక బ్యాచ్‌కు సుమారు 120 మంది అభ్యర్థులకు ఉచిత కోచింగ్ క్లాస్‌లు ఇవ్వడం జరుగుతుంది.’ అని ఆయన చెప్పుకొచ్చారు.
వీడియోలు యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తారు..
కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ నిర్వహిస్తామని డాక్టర్ పవన్ సచన్ తెలిపారు. అలాగే, ఆయా తరగతులకు సంబంధించిన వీడియోలను డైట్ ట్యూబ్ ఛానెల్‌లో కూడా అప్‌లోడ్ చేయబడతాయని చెప్పారు. ఈ వీడియోలు టెట్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతగానో ఉపకరిస్తున్నాయన్నారు. ఒకవేళ అభ్యర్థులకు ఎవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్‌లో తమ సందేహాన్ని వ్యక్తం చేయవచ్చునని చెప్పారు. అలా వచ్చిన సందేహాలకు సంబంధిత సబ్జెక్టులలో నిపుణులచేత వివరణ ఇప్పించడం జరుగుతుందన్నారు.
Also read:
COVID-19 surge : మూడు లేదా నాలుగు రోజులు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించండి : హైకోర్టు సంచలన ఆదేశాలు