వచ్చే కేంద్ర బడ్జెట్ 2025తో యువతకు 85 వేల ఉద్యోగాలు.. కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడి

వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్ చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దేశ అభివృద్ధికి హీతోధికంగా తోడ్పడే కీలక ప్రాజెక్టులకు బడ్జెట్ లో కేటాయింపులు జరగనున్నాయి. తద్వారా దేశ ప్రగతి మునుముందుకు సాగడంతోపాటు.. పెద్ద ఎత్తున దేశ యువతకు ఉద్యోగాలు సైతం సృష్టించడం సాధ్యపడుతుంది..

వచ్చే కేంద్ర బడ్జెట్ 2025తో యువతకు 85 వేల ఉద్యోగాలు.. కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడి
Union Finance Ministry

Updated on: Jan 22, 2025 | 1:01 PM

న్యూఢిల్లీ, జనవరి 21: మరికొన్ని వారాల్లో కేంద్ర బడ్జెట్ 2025-26 రానుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రకటనలో కీలక విషయాలు ప్రస్తావించనుంది. ముఖ్యంగా సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఓ పోస్ట్‌ పెట్టింది. అందులో సెమీకండక్టర్స్, డిస్‌ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం.. ప్రోగ్రామ్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, సెమీకండక్టర్ డిజైనింగ్ కంపెనీలకు మద్దతు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.

2021, డిసెంబర్ 15వ తేదీన ఆమోదించబడిన సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 16 సెమీకండక్టర్ డిజైన్ కంపెనీలకు, ఐదు సెమీకండక్టర్ ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు మొత్తం రూ.1.52 లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షిస్తాయని అంచనా. అంతేకాకుండా, దేశ యువతకు ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 25 వేల ప్రత్యక్ష ఉద్యోగాలను, మరో 60 వేల పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది దేశ సాంకేతిక శ్రామికశక్తిని పెంచడంలో కీలక మైలురాయిగా మారనుంది.

సెమీకండక్టర్ల ప్యాకేజింగ్, డిజైనింగ్‌లో పాల్గొన్న కంపెనీలకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను అందించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సెమీకండక్టర్స్, డిస్‌ప్లే తయారీకి భారత్‌ని గ్లోబల్ హబ్‌గా మార్చడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇది విస్తృత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం పురోగతికి కూడా దోహదపడనుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రొడక్షన్‌-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కింద రూ. 6.14 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తిని, రూ. 3.12 లక్షల కోట్ల ఎగుమతులు చేసింది. ఇది ఈ రంగంలో 1.28 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించింది. అంతేకాకుండా ఈ పథకం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ పవర్‌హౌస్‌గా భారత్‌ని బలోపేతం చేసింది. మునుముందు విక్షిత్ భారత్ సాధించడంలో కన్వర్జెన్స్, కమ్యూనికేషన్స్, బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీస్ (CC&BT) సాంకేతికతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆశా భావం వ్యక్తంచేసింది. బలమైన పాలసీ ఫ్రేమ్‌వర్క్, పెట్టుబడులతో.. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీలో అగ్రగామిగా భారత్‌ ఎదగనుందని, ప్రపంచ సరఫరా చైన్‌కు, ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలోనూ గణనీయంగా దోహదం చేయస్తుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.