Failure in Exams: తరగతి గది పరీక్షల్లో ఫెయిల్‌..! కానీ జీవితం పెట్టిన పరీక్షల్లో కీర్తి శిఖరాలకు..

|

Jun 29, 2022 | 5:54 PM

జీవితం అంటే చదువులు, మార్కులు, ర్యాంకులు, ఉన్నత ఉద్యోగాలు మాత్రమే కాదు. ఇవన్నీ విజయానికి కొలమానాలు కానేకాదు. మరి ఎందుకు చదువుకోవాలి.. దాని పరమార్థం ఏమిటి? మన జీవితంలో చదువు, కెరీర్‌ల పాత్ర ఎట్టిది ? గొప్పగొప్పవాళ్లంతా పెద్దపెద్ద చదువులు చదివినవాళ్లేనా? పరీక్షల్లో..

Failure in Exams: తరగతి గది పరీక్షల్లో ఫెయిల్‌..! కానీ జీవితం పెట్టిన పరీక్షల్లో కీర్తి శిఖరాలకు..
Failure Person
Follow us on

Careers are not dependent on grades: జీవితం అంటే చదువులు, మార్కులు, ర్యాంకులు, ఉన్నత ఉద్యోగాలు మాత్రమే కాదు. ఇవన్నీ విజయానికి కొలమానాలు కానేకాదు. మరి ఎందుకు చదువుకోవాలి.. దాని పరమార్థం ఏమిటి? మన జీవితంలో చదువు, కెరీర్‌ల పాత్ర ఎట్టిది ? గొప్పగొప్పవాళ్లంతా పెద్దపెద్ద చదువులు చదివినవాళ్లేనా? పరీక్షల్లో ఫెయిల్‌ అయితే అంతా ముగిసిపోయినట్లేనా..? ఆత్మహత్యే శరణ్యమా ? గెలుపోటముల మధ్య తేడా ఏమిటి? వాటిలోతుల్లోకెళ్లి చూద్దామా..

చదువంటే ఏమిటి?
చదువంటే.. జ్ఞానం. మంచి చెడులను వేరుపరచి తరచి చూసే విచక్షణను అందించే జ్ఞాన నేత్రం. అందుకే గురువుల దగ్గర పఠనాభ్యాసం చెయ్యాలి. ఐతే బతుకు బండి బడి చదువుతో ఆగిపోదు..పోకూడదు కూడా. బడితోపాటు సమాజాన్ని చదవాలి. అప్పుడే అభిరుచికి తగిన రంగంలో శిఖరాలను అధిరోహించడానికి రెక్కలు వస్తాయి. ధనవంతులు అవ్వడానికి మాత్రమేకాకుండా గుణవంతులు కావడానికి కూడా చదువే పునాది. మూస పద్ధతిలో తోసుకుపోయే ప్రస్తుత విద్యావిధానంలో సర్టిఫికేట్లు, డిగ్రీలు, మెడల్లు మనల్ని ఎటుగా తీసుకెళ్తున్నాయో తరచి చూసుకోవల్సిన బాధ్యత మనపై ఉంది.

విజయమంటే..?
జీవితంలో డబ్బు సంపాదన కీలకమైన విషయం. దీనితోపాటు ఇతరులకు సేవనందించాలి. అది ప్రభుత్వ ఉద్యోగ‌మైనా, ప్రైవేటు ఉద్యోగ‌మైనా, వ్యాపార‌మైనా, వృత్తి ఏదైనా, రంగం ఎలాంటిదైనా పై రెండు పనులు నెరవేర్చుకోవచ్చు. ఎంచుకున్న కెరీర్ ఏదైనా విజ‌యానికి కొల‌మానాలు మాత్రం ఆ ప‌నిలో కనబరిచే స‌మ‌ర్థత, నిజాయ‌తీ, నిబ‌ద్ధత, వ్యక్తిత్వం, నైతిక విలువ‌లు. వీటితో అద్భుతాలు చేసినవాళ్లు కోకొల్లలు. వాళ్లలో కొందరు..

ఇవి కూడా చదవండి

కమల్‌హాసన్‌
నటనలో యావత్‌ బారతాన్ని ఒక్కవూపు వూపిన వారిలో ఒకరు కమల్‌హాసన్‌. ఆయన స్కూల్ డ్రాప్‌ఔట్‌. పదో తరగతి కూడా చదవలేదు. అయితేనేం నాలుగు దక్షిణ భారత భాషల్లో అనర్గళంగా మాట్లాడటం, రాయటం, చడవడంపై పట్టుసాధించాడు. కమల్‌హాసన్‌ నటుడు మాత్రమేకాదు రచయిత, డైరెక్టర్‌, ప్రొడ్యుసర్‌, ప్లేబ్యాక్‌ సింగర్‌.. మల్టీట్యాలెంటెడ్‌ స్టార్‌గా ఎదిగాడు.

సుభాష్‌ చంద్ర
ప్రముఖ మీడియ కంపెనీ జీ నెట్‌వర్క్‌ గ్రూప్‌ అధినేత సుభాష్ చంద్ర గోయెంకా నేడు భారతీయ కుబేరుల్లో (Indian billionaire) ఒకరు. హర్యానాలోని హిసార్ జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టిన సుభాష్ చంద్ర 10వ తరగతి మధ్యలోనే చదువు మానేసి, బతుకు తెరువుకోసం ఉద్యోగ వేటలోపడ్డాడు. మొదట్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు బియ్యం సేకరించి సరఫరా చేసే వ్యాపారిగా కెరీర్‌ ప్రారంభించి నేడు బిలియనీర్‌గా ఎదిగాడు. జీ టెలివిజన్‌తో పాటు ఎస్సెల్ గ్రూప్‌కు ఛైర్మన్‌గా కొనసాగుతున్నాడు.

ధీరూబాయ్‌ అంబానీ
సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ధీరూబాయ్‌ అంబానీ నేడు ప్రపంచ కుబేరుల్లో ఒకడుగా ఎదిగాడు. యెమెన్‌లోని ఆయిల్‌ కంపెనీలో 16 ఏళ్ల వయసులో క్లర్క్‌గా జీవితం ప్రారంభించాడు. 1958లో రూ.50,000లతో ఇండియా వచ్చి టెక్స్‌టైల్‌ ట్రేడింగ్‌ కంపెనీని ప్రారంభించాడు. నేడు అతని ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ వ్యాపార సాంమ్రాజ్యం మొదటి స్థానంలో ఉంది.

మహేంద్రసింగ్‌ ధోని
మనదేశ ప్రఖ్యాత క్రికెటర్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనికి తన చిన్నతనంలో క్రికెట్ పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. చిన్నప్పుడు బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఆటలు ఆడేవాడు. ధోనీ గోల్ కీపర్‌గా ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు, అతని కోచ్ అతన్ని స్థానిక క్రికెట్ క్లబ్‌లో వికెట్ కీపర్‌గా ఆడటానికి ఎంపిక చేశాడు. కాలక్రమేణా క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ధోని కుటుంబాన్ని పోషించుకోవడానికి రైలు టిక్కెట్ ఎగ్జామినర్‌గా పనిచేశాడు. 2004లో భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎదిగి, ఎన్నో రికార్డులను సాధించాడు.

అబ్దుల్‌ కలాం, ఎంటర్‌ప్రెన్యూర్ నారాయణ మూర్తి, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఎయిర్ డెక్కన్‌ కెప్టెన్‌ గోపినాథ్‌, వరల్డ్‌ ఛాంపియన్‌ సుశీల్ కమార్‌, స్టీవ్‌ జాబ్స్‌, బిల్‌ గేట్స్‌, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, అబ్రహాం లింకన్‌, వాల్ట్‌ డిస్నీ వీరందరి ప్రయాణం ఉన్నత చదువులతోప్రారంభం అవ్వలేదు. అభిరుచి కలిగిన రంగంలో స్వయం కృషితో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలను ఎదుర్కొని కష్టపడి ఎదిగినవాళ్లు వీళ్లంతా. ఇంటర్‌ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని, పదిలో ఫెయిల్ అయ్యారని తనువు చాలించాలనే నిర్ణయానికి రావడం సబబేనా..? ఓ సారి ఆలోచించండి..

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.