తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాలు పెరిగినట్లు దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్ లింబాద్రి స్పష్టం చేశారు. బీటెక్ కోర్సుల కంటే బీకాంలో ప్రవేశాలు పొందిన విద్యార్ధుల సంఖ్యే అధికంగా ఉన్నట్లు తేలిపారు. రాష్ట్రంలో బీటెక్ కంటే బీకాంలో అత్యధిక ప్రవేశాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక 2022-23 విద్యా సంవత్సరానికిగానూ డిగ్రీలో మొత్తం 2,10,970 మంది అడ్మిషన్లు పొందారు. బీకాం కోర్సుల్లో దాదాపు 93,480 మంది (దోస్త్, నాన్ దోస్త్ ప్రవేశాలతో కలిపి)కి పైగా ప్రవేశాలు పొందారు. కామర్స్‌లో కంప్యూటర్ సబ్జెక్టును, బీకాం బిజినెస్ ఎనలిటిక్స్ కోర్సును ప్రవేశపెట్టడం, కామర్స్ విభాగంలో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతుండటంతో ఆ కోర్సులో చేరికలు పెరుగుతున్నాయని డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
అబ్బాయిల కంటే రికార్డు స్థాయిలో అమ్మాయిల అడ్మిషన్లు
మొత్తం విద్యార్థుల్లో 1,09,480 మంది అమ్మాయిలు కావడం మరో విశేషం. అంటే మొత్తం ప్రవేశాల్లో 52.06 శాతం మంది అమ్మాయిలు అడ్మిషన్‌లు పొందారు. బీఎస్‌సీ లైఫ్‌సైన్స్, ఫిజికల్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ (బీఎస్‌డబ్ల్యూ) కోర్సుల్లో అధికంగా అమ్మాయిలు అడ్మిషన్‌లు పొందారు. బీఎస్‌సీ లైఫ్ సైన్స్‌లో అత్యధికంగా 75 శాతం వారే ఉండటం గమనార్హం. ఇక బీటెక్ కోర్సుల్లో 80 వేల మంది ప్రవేశాలు పొందారు. ఇంజినీరింగ్ అడ్మిషన్ల కంటే రెండున్నర రెట్లకు పైగా డిగ్రీ ప్రవేశాలు నమోదయ్యాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.