TS Govt Jobs: కొత్త ప్రభుత్వంలో మొదలైన కొలువుల జాతర.. నేడు సీఎం రేవంత్ చేతుల మీదగా నియామక పత్రాలు
కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారిగా కొలువుల జాతర జరగనుంది. కొత్తగా ఎంపికైన 7094 మంది స్టాఫ్ నర్సులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నియామక పత్రాలను అందించనున్నారు. ఎల్బి స్టేడియం వేదికగా జరగనున్న కార్యక్రమం కోసం అధికార యంత్రంగం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 2 ఏళ్ల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ... అనేక కారణాలతో స్టాఫ్ నర్స్ భర్తీ ప్రక్రియ కొంత నత్తనడకన సాగింది. ఇటీవల స్టాఫ్ నర్స్‌ల మెరిట్ లిస్ట్..
హైదరాబాద్, జనవరి 31: కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారిగా కొలువుల జాతర జరగనుంది. కొత్తగా ఎంపికైన 7094 మంది స్టాఫ్ నర్సులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నియామక పత్రాలను అందించనున్నారు. ఎల్బి స్టేడియం వేదికగా జరగనున్న కార్యక్రమం కోసం అధికార యంత్రంగం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 2 ఏళ్ల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ … అనేక కారణాలతో స్టాఫ్ నర్స్ భర్తీ ప్రక్రియ కొంత నత్తనడకన సాగింది. ఇటీవల స్టాఫ్ నర్స్‌ల మెరిట్ లిస్ట్ ప్రకటించిన సర్కారు… నేడు స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించనుంది.
ప్రభుత్వ కొలువు లక్షల మంది కల. అలాంటి కలను సాకారం చేసుకున్న సుమారు 7వేల మందికి ఈ రోజు సర్కారు నియామక పత్రాలను అందించనుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7142 నర్సింగ్ పోస్ట్ లకు గాను 7094 అర్హుల జాబితాను ఇటీవల సర్కారు ప్రకటించింది. వీరిలో ప్రధానంగా వైద్య సంచాలకులు, ప్రజారోగ్య సంచాలక విభాగాల్లో 5571 , తెలంగాణ వైద్య విధాన పరిషత్ కి 736, మహాత్మా జ్యోతిభా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్సిల్ ఎడ్యుకేషన్ సొసైటీకి 253 మంది ఎంపికైనట్టు తెలిపింది. స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎంపికైన వారిలో 88.16% మహిళలు కాగా 11.84% మంది పురుషులని స్పష్టం చేసింది. వారందరికీ ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల నుంచి ఎల్బి స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించనున్నారు. ఇందుకోసం ఎల్బి స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టాఫ్ నర్స్ పరీక్షల్లో అర్హత సాధించి… పోస్ట్ లకు ఎంపికైన వారికి కార్యక్రమానికి హాజరుకావల్సిందిగా సర్కారు సమాచారం అందించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగనున్న కార్యక్రమంలో సీఎంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ సహా పలువురు మంత్రులు హాజరుకానునట్టు సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా అప్పటికే ఖాళీగా ఉన్న 5204 స్టాఫ్ నర్స్ పోస్ట్‌లతో పాటు, కొత్తగా అనుమతి లభించిన 1890 పోస్ట్‌లు కలిపి మొత్తం 7142 పోస్ట్‌ల భర్తీకి 2022 డిసెంబర్ 30న అప్పటి సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి 40,936 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, గతేడాది జరిగిన కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 38,674 మంది హాజరయ్యారు. అయితే అప్పట్లోనే ఫలితాలు వస్తాయని ఆశించినప్పటికి అభ్యర్థులకు నిరాశే ఎదురైంది. తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత గత డిసెంబర్ 28 ప్రొవిషనల్ లిస్టుని, ఈ నెల 28న పోస్ట్‌లకు ఎంపికైన వారి తుది జాబితాను సర్కారు విడుదల చేసింది. 7142 పోస్ట్ లలో 7094 పోస్టులు భర్తీ చేసినట్టు పేర్కొన్న సర్కారు, సరైన అభ్యర్థులులేని కారణంగా మరో 138 పోస్ట్‌లను భర్తీ చేయలేకపోయామని ప్రకటించింది. ఎంపికైన వారిలో అత్యధిక శాతం మంది వెనుకబడిన తరగతులకు చెందిన వారిగా సర్కారు స్పష్టం చేసింది.
ఎల్బి స్టేడియం వేదికగా జరగనున్న నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తాజాగా నియామకం అయిన 7వేల మందికి పైగా స్టాఫ్ నర్సులను రాష్ట్ర వ్యాప్తంగా 26 వైద్య కళాశాలలు, సూపర్ స్పెశాలిటీ, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలకు కేటాయించనునట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఫలితంగా ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.