CBSE Single Girl Child Scholarship: మీరు మీ తల్లిదండ్రులకు ఏకైక కూతురా? అయితే ఈ స్కాలర్‌షిప్‌ మీకోసమే

పదో తరగతి పూర్తి చేసిన బాలికలకు సీబీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా కలిగిన బాలికా విద్యార్ధినులకు ప్రతియేటా మాదిరిగానే ఈ సారి కూడా సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ మెరిట్ స్కాలర్‌షిప్‌ అందించేందుకు ముందుకొచ్చింది. పదో తరగతి పాసై 11వ లేదా 12వ తరగతిలో ప్రవేశాలు పొందిన విద్యార్ధినులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు..

CBSE Single Girl Child Scholarship: మీరు మీ తల్లిదండ్రులకు ఏకైక కూతురా? అయితే ఈ స్కాలర్‌షిప్‌ మీకోసమే
CBSE Single Girl Child Scholarship

Updated on: Jan 27, 2025 | 6:37 AM

తల్లిదండ్రులకు ఒకే ఒక సంతానంగా కలిగి ప్రతిభ కలిగిన బాలికలకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) బోర్డు యేటా సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ మెరిట్ స్కాలర్‌షిప్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా కలిగి ఉన్న పదో తరగతిపూర్తి చేసిన బాలికా విద్యార్ధినులకు ఈ స్కాలర్‌షిప్‌ అందించేందుకు ప్రకటన జారీ చేసింది. ఇందుకు సంబంధించి సీబీఎస్‌ఈ- సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2024కు దరఖాస్తులు చేసుకునేందుకు చివరి గడువను పొడిగిస్తూ సీబీఎస్‌ఈ బోర్డు ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినులు డిసెంబర్‌ 23, 2024వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. తాజాగా ఆ గడువును వచ్చే నెల 8వ తేదీ వరకు పొడిగించింది.

సీబీఎస్‌ఈ- సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2024కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధినులు.. వారి తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. అంటే వారి తర్వాత లేదా ముందు తల్లిదండ్రులకు సంతానం కలిగి ఉండకూడదు. అలాగే విద్యార్థిని సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి. అదే విధంగా సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి, పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.2500 కంటే మించకూడదు.

ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఫిబ్రవరి 08, 2025వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సీబీఎస్‌ఈ పాఠశాలల దరఖాస్తు ధ్రువీకరణ తేదీ ఫిబ్రవరి15, 2025. ఇక ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్‌ చేయించుకోవాలంటే, విద్యార్థిని చదువుతున్న కోర్సుల్లో కనీసం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఎంపికైన విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.1000 చొప్పున అందిస్తారు. ఇతర విషయాలు అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.