
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF).. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 241 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన మహిళా, పురుష అభ్యర్థులు ఎవరైనా ఆగస్టు 20వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. క్రీడాంశాలు, అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఈక్వెస్ట్రియన్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, ఐస్-స్కీయింగ్, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, వాటర్ స్పోర్ట్స్, రెజ్లింగ్, షూటింగ్, టైక్వాండో, వుషు, ఫెన్సింగ్, కాయాకింగ్, కానోయింగ్ (పడవ పందెం), రోయింగ్, టెబుల్ టెన్నిస్ వంటి తదితర ఆటల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వీరు సంబంధిత క్రీడాంశంలో నేషనల్ లేదా ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లలో తప్పనిసరిగా పాల్గొని ఉండాలి. అలాగే పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 01 ఆగస్టు 2025 నాటికి తప్పనిసరిగా 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 20, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.147.20 తప్పని సరిగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. అప్లికేషన్స్ షార్ట్‌లిస్టింగ్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అంటే ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఎంపిక చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.