AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నువ్వు డ్రైవర్‌గా పనిచేస్తే కనీసం కడుపునిండా భోజనమైనా దొరుకుతుంది’.. అయినా వెనక్కి తగ్గలేదు! NASA వరకు వెళ్లాడు

ముంబై మురికివాడలో పేదరికం మధ్య పెరిగిన జయకుమార్ వైద్యకు చదువుకోవడమే పెద్ద సవాలుగా మారింది. ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోయినా, ఎన్నో అవమానాలు ఎదురైనా తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. కుటుంబానికి అండగా నిలుస్తూనే కష్టపడి చదివిన ఆయన, నేడు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక నాసా గాడర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పేదరికం తన కలలకు అడ్డుకాదని నిరూపించిన జయకుమార్ ప్రయాణం, పట్టుదల ఉంటే అసాధ్యమనుకున్న లక్ష్యాలను సైతం చేరుకోవచ్చని చాటిచెబుతోంది..

‘నువ్వు డ్రైవర్‌గా పనిచేస్తే కనీసం కడుపునిండా భోజనమైనా దొరుకుతుంది'.. అయినా వెనక్కి తగ్గలేదు! NASA వరకు వెళ్లాడు
NASA Engineer Jayakumar Vaidya Success Story
Srilakshmi C
|

Updated on: Oct 28, 2026 | 8:52 PM

Share

‘నువ్వు డ్రైవర్‌గా పనిచేస్తే కనీసం కడుపునిండా భోజనమైనా తినగలవు’, ‘నీకు చదువెందుకు?’.. ఇలాంటి మాటలు వింటే ఎవరైనా నిరాశకు గురవుతారు. కానీ అతను మాత్రం తన లక్ష్యాన్ని మరిచిపోలేదు. పేదరికం, ఆకలి, చదువుకు డబ్బులేని పరిస్థితి, సమాజం నుంచి ఎదురైన అవమానాలు.. ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. చదువుకుంటూనే చిన్నచిన్న పనులు చేసి కుటుంబానికి అండగా నిలిచాడు. చివరకు తన పట్టుదలతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో కీలక బాధ్యతలు చేపట్టాడు. ముంబయి మురికివాడలోని చిన్న గది నుంచి నాసా వరకు సాగిన అతని ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అతనే జయకుమార్ వైద్య.

పేదరికంలో పుట్టి.. పెద్ద కలలు కన్నాడు!

జయకుమార్ వైద్య ముంబయిలోని కుర్లా మురికివాడలో నిరుపేద కుటుంబంలో పెరిగాడు. అతను పుట్టకముందే తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో తల్లి నళినిపైనే కుటుంబ బాధ్యత పడింది. చిన్నచిన్న పనులు చేస్తూ వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే ఆమె కొడుకును చదివించింది. ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండటంతో చాలా రోజులు పస్తులు ఉండాల్సి వచ్చేది. కొన్నిసార్లు అర్ధాకలితోనే రోజులు గడిపేవారు. ఇంట్లో కిరోసిన్ ఆదా చేసేందుకు అతని తల్లి ఒకేసారి నాలుగైదు రోజులకు సరిపడా చపాతీలు తయారు చేసేది. మరోవైపు ఇంట్లో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో జయకుమార్ వీధి దీపాల కింద కూర్చుని చదువుకునేవాడు. చదువుపై ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ పాఠశాల ఫీజులు చెల్లించడం అతనికి పెద్ద సవాలుగా మారింది. ఫీజు కొన్ని వందల రూపాయలే అయినా కుటుంబం దగ్గర అంత డబ్బు ఉండేది కాదు. ఫీజు చెల్లించకపోతే పరీక్షలు రాయనివ్వమని పాఠశాల యాజమాన్యం చెప్పేది. ఒకసారి ఫీజు పూర్తిగా కట్టిన తర్వాతే పరీక్ష ఫలితాలు ఇస్తామని కూడా చెప్పడంతో అతను మరింత ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితులను చూసిన ఇరుగుపొరుగు వారు, ‘ఫీజు కట్టలేనప్పుడు చదువెందుకు? ఏదైనా పని చేసుకుంటే కనీసం కడుపునిండా తినవచ్చు. పెద్దయ్యాక డ్రైవర్‌గా పనిచేయొచ్చు’ అంటూ నిరుత్సాహపరిచేవారు.

అయితే జయకుమార్ ఆ మాటలను తన లక్ష్యానికి అడ్డంకులుగా భావించలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును కొనసాగించి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. జయకుమార్ చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేవాడు. ముఖ్యంగా అంతరిక్షం, సైన్స్, టెక్నాలజీ, రోబోటిక్స్‌పై అతనికి అపారమైన ఆసక్తి ఉండేది. తనకు ఇష్టమైన రంగంలోనే భవిష్యత్తును నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతనికి ఎన్నో అడ్డంకులు సృష్టించాయి. సుమారు 10–12 ఏళ్ల వయసు నుంచే చదువుకుంటూ చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడు. కొంత పెద్దయ్యాక టీవీల మరమ్మతు చేయడం నేర్చుకుని, నెలకు నాలుగు వేల రూపాయల ఆదాయం వచ్చేలా ఆ పని కూడా చేశాడు. అలా వచ్చిన డబ్బుతో తల్లికి ఆర్థికంగా తోడ్పడ్డాడు. పై చదువుల సమయంలో స్కాలర్‌షిప్‌లు పొందడంతోపాటు స్వచ్ఛంద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందుకున్నాడు. వడ్డీలేని రుణాల సహకారంతోనూ చదువును కొనసాగించాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ముంబయిలోని కేజే సోమయ్యా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో చేరాడు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు పుస్తకాలు, ఇతర విద్యా అవసరాలకు ఖర్చులు పెరిగాయి. దీంతో విదేశాల్లోని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ట్యూషన్లు చెప్పి ఆదాయం సంపాదించేవాడు. ఒకవైపు చదువు, మరోవైపు పని.. ఇలా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ తన లక్ష్యం వైపు అడుగులు వేశాడు.

ఇవి కూడా చదవండి

రోబోటిక్స్‌పై ఆసక్తి.. ఎన్నో అవార్డులు!

చిన్నప్పటి నుంచి రోబోటిక్స్‌పై ఆసక్తి ఉన్న జయకుమార్ వివిధ పోటీల్లో పాల్గొనేవాడు. తన ప్రతిభతో మూడు జాతీయ స్థాయి అవార్డులు, నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నాడు. ఈ గుర్తింపులు అతనిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. అతని కృషికి ఫలితంగా ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో ప్రముఖ సంస్థ లార్సెన్ అండ్ టుబ్రోలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభించింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరాడు. ఈ అవకాశం అతని జీవితంలో కీలక మలుపుగా మారింది. అక్కడ పరిశోధనలు చేస్తూనే అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్‌కు పరిశోధనా పత్రాలు పంపేవాడు. అతని పరిశోధనలకు గుర్తింపు లభించి, పత్రాలు ప్రచురితమయ్యాయి. దీంతో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో స్కాలర్‌షిప్‌తో ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసే అవకాశం దక్కింది.

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న సమయంలో జయకుమార్‌కు మరో గొప్ప అవకాశం లభించింది. నాసాలోని గాడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో ప్రత్యేకమైన ఎక్స్-రే మిర్రర్ల తయారీకి సంబంధించిన పరిశోధనా ప్రాజెక్టుకు ఎంపికయ్యాడు. ఈ ప్రాజెక్టులో అటామిక్ లేయర్ డిపోజిషన్ సాంకేతికతను ఉపయోగించి ఎక్స్-రే మిర్రర్లను తయారు చేసే పనిలో పాల్గొన్నాడు. అలా నాసాలో ఇంటర్న్‌గా అడుగుపెట్టిన అతను, తన ప్రతిభ, అనుభవం, కృషితో అక్కడే ఉద్యోగిగా స్థిరపడ్డాడు. ప్రస్తుతం నాసాలోని గాడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్ ఇంజినీరింగ్ లీడ్‌గా, గ్రౌండ్ సిస్టమ్స్ ఆపరేషన్ లీడ్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గ్రహాల వాతావరణాన్ని పరిశోధించేందుకు ఉపయోగించే మాస్ స్పెక్ట్రోమీటర్ల వంటి అత్యాధునిక శాస్త్రీయ పరికరాలను రూపొందించడం, వాటిని పరీక్షించడం, వాటి నిర్వహణకు సంబంధించిన పనులను పర్యవేక్షించడం అతని విధుల్లో భాగం. చిన్నప్పుడు చదువుకోవడానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జయకుమార్, ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో ఒకటైన నాసాలో కీలక బాధ్యతలు చేపట్టడం విశేషం. తన జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ జయకుమార్ తన అభ్యాసాన్ని ఆపలేదు. మంచి ఉద్యోగం వచ్చినా తనకు ఇష్టమైన విషయాలను నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నాడు. భవిష్యత్తులో తనను తాను శాస్త్రవేత్తగా చూడాలనేది అతని ఆకాంక్ష.

పేదరికం మనిషి కలలకు అడ్డంకి కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు చదువును కష్టతరం చేయవచ్చు. చుట్టూ ఉన్నవారి నిరుత్సాహపరిచే మాటలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. కానీ పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర ప్రయత్నం ఉంటే వాటన్నింటినీ అధిగమించవచ్చని జయకుమార్ వైద్య ప్రయాణం నిరూపిస్తోంది. పూరిగుడిసెలో మొదలైన అతని ప్రయాణం నాసా వరకు చేరింది. ఒకప్పుడు చదువెందుకని ప్రశ్నించినవారికి తన విజయంతోనే సమాధానం చెప్పాడు. పరిస్థితులు ఎలా ఉన్నా లక్ష్యంపై దృష్టి పెట్టి, అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగితే అసాధ్యమనుకున్న కలలను కూడా నిజం చేసుకోవచ్చని అతని జీవితం మనకు గొప్ప పాఠం నేర్పుతోంది.

Follow Us
నువ్వు డ్రైవర్‌గా పనిచేస్తే కనీసం కడుపునిండా భోజనమైనా దొరుకుతుంది
నువ్వు డ్రైవర్‌గా పనిచేస్తే కనీసం కడుపునిండా భోజనమైనా దొరుకుతుంది
ఆ ఒక్క డైలాగ్‌తో దూకుడు పెంచిన వైభవ్.. అసలు విషయం చెప్పిన అభిషేక్
ఆ ఒక్క డైలాగ్‌తో దూకుడు పెంచిన వైభవ్.. అసలు విషయం చెప్పిన అభిషేక్
Video:సౌదీ పై బాంబు దాడులు.. హౌతీలు వీడియో విడుదల!
Video:సౌదీ పై బాంబు దాడులు.. హౌతీలు వీడియో విడుదల!
తెలంగాణలో ముందుగానే వేసవి సెలవులు రానున్నాయా?
తెలంగాణలో ముందుగానే వేసవి సెలవులు రానున్నాయా?
ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి.. పెరుగు ఎప్పుడు తినాలి..?
ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి.. పెరుగు ఎప్పుడు తినాలి..?
రాముడి పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రాముడి పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
10 నిమిషాలు బైక్‌పై కదలకుండా కూర్చొంటే.. ఫ్రీగా బైక్!
10 నిమిషాలు బైక్‌పై కదలకుండా కూర్చొంటే.. ఫ్రీగా బైక్!
ఈ పచ్చిమిర్చి చట్నీ ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
ఈ పచ్చిమిర్చి చట్నీ ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
  సీతాఫలం గింజలు తీయడానికి ఇక కష్టపడొద్దు.. ఈ చిట్కాలు చాలు
  సీతాఫలం గింజలు తీయడానికి ఇక కష్టపడొద్దు.. ఈ చిట్కాలు చాలు
 ఉదయాన్నే ధనియాల కషాయం తాగుతున్నారా?.. దీని ప్రయోజనాలు తెలుసా? 
 ఉదయాన్నే ధనియాల కషాయం తాగుతున్నారా?.. దీని ప్రయోజనాలు తెలుసా?