విదేశాల్లో విద్యనభ్యసించే యువతలో భారత్ నుంచి వెళ్లేవారి సంఖ్య తక్కువేమీ కాదు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాలకు ఏటా వేల కొద్ది విద్యార్ధులు చదువుల నిమిత్తం దేశం దాటి వెళ్తుంటారు. ఐతే ఆస్ట్రేలియాలో మాత్రం మన విద్యార్ధులకు చుక్కెదురౌతుంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల విద్యార్ధులకు చెందిన దాదాపు 50 శాతం వీసాలను ఆస్ట్రేలియా తిరస్కరించినట్లు తాజాగా విడుదల చేసిన ఇమ్మిగ్రేషన్ డేటాలో వెల్లడించింది. ఈ దేశాల్లో భారత్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ ముందు వరుసలో ఉన్నాయి. ఈ నాలుగు దేశాలకు చెందిన ప్రతి నలుగురి స్టూడెంట్ వీసాల్లో ఒకటి తిరస్కరణకు గురౌతుంది.
2022లో అత్యధికంగా ఈ దేశాలకు చెందిన ఒకేషనల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు వీసా మంజూరు రేటు 50% కంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. 900లకుపైగా దరఖాస్తు చేసుకుంటే వాటిల్లో కేవలం 34 మాత్రమే ఆమోదించబడుతున్నాయి. అంటే కేవలం 3.8% మాత్రమే.
ఆఫ్‌షోర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (VET) దరఖాస్తుదారులకు అత్యంత కఠినమైన పద్ధతుల్లో ఆస్ట్రేలియన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలన(స్క్రూటినీ) నిర్వహిస్తున్నారు. అధికమొత్తంలో వీసాలు తిరస్కరణకు గురవ్వడానికి ప్రధాన కారణం ఇదే. మరో ముఖ్య కారణం ఏమంటే.. ఈ దేశాలకు చెందిన విద్యార్ధులు తప్పుడు ఆధారాలతో వీసాలను పొందుతున్నారని, నకిళీ ఏజెంట్లు సృష్టించిన వీసాలు అధికంగా తిరస్కరించబడుతున్నాయని అధికారులు అంటున్నారు. దీంతో అధికమంది విద్యార్ధులు వెనుదిరుగుతున్నారు.
జూలై 2022 నాటికి దాదాపు 96,000 మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో విద్యను అభ్యసిస్తున్నట్లు నివేదికలు తెల్పుతున్నాయి. చైనా తర్వాత ఇంత పెద్దసంఖ్యలో ఆస్ట్రేలియాలోనే చదువుతున్నారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.