ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్).. రాష్ట్రంలోని డా బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు, డా బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ-మెడికల్ అకాడమీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు బీఆర్‌ఏజీ సెట్-2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న బాలబాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులం ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు బీఆర్‌ఏజీ ఎంట్రన్స్ టెస్ట్- 2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో 2023-24 విద్యాసంవత్సరంలో మూడో తరగతి, 2024-25 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధిత జిల్లాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే విద్యార్థి వయస్సు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే సెప్టెంబర్ 01, 2012 నుంచి ఆగస్టు 31, 2016 మధ్య జన్మించి ఉండాలి. అలాగే ఓసీ/ బీసీ/ బీసీ సి విద్యార్థులు సెప్టెంబర్ 01, 2014 నుంచి ఆగస్టు 31, 2016 మధ్య జన్మించి ఉండాలి. ఇంటర్మీడియట్ ప్రవేశాలకైతే విద్యార్థులు ఆగస్టు 31, 2025 నాటికి 17 ఏళ్లు మించకుండా ఉండాలి. విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు. ఐఐటీ నీట్ కోచింగ్ సెంటర్లలో ప్రవేశాలకు ఐఐటీ మెడికల్ అకాడమీల పరీక్ష కూడా ఉంటుంది. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఐదో తరగతి ప్రవేశాలకు మొత్తం 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. గణితంలో 15, ఇంగ్లిష్‌లో 10, తెలుగులో 10, ఈవీఎస్‌లో 15 ప్రశ్నల చొప్పున అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. అలాగే ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రం కూడా ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలకు ఉంటుంది. గణితంలో 15, ఫిజికల్ సైన్స్‌లో 15, సైన్స్‌లో 15, సామాకజిక అధ్యయనాలులో 10, ఇంగ్లిష్‌లో 15, లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్‌లో 30 ప్రశ్నల చొప్పున అడుగుతారు. రెండున్నర గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. రెండు తరగతులకు క్వశ్చన్ పేపర్లు ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.