APPSC Job Notifications 2025: నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఏపీపీఎస్సీ నుంచి మరో 20 కొత్త నోటిఫికేషన్లు! త్వరలోనే..

ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలో ఏపీపీఎస్సీ 20 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 80 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజాబాబు వెల్లడించారు. ఈ నోటిఫికేషన్లన్నీ సెప్టెంబర్ నెలాఖరు నాటికి జారీ చేస్తామని ఆయన అన్నారు..

APPSC Job Notifications 2025: నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఏపీపీఎస్సీ నుంచి మరో 20 కొత్త నోటిఫికేషన్లు! త్వరలోనే..
APPSC Job Notifications

Updated on: Sep 03, 2025 | 4:25 PM

అమరావతి, సెప్టెంబర్‌ 3: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలో ఏపీపీఎస్సీ 20 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 80 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజాబాబు వెల్లడించారు. ఈ నోటిఫికేషన్లన్నీ సెప్టెంబర్ నెలాఖరు నాటికి జారీ చేస్తామని ఆయన అన్నారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే అటవీ శాఖలో 691 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు, 100 ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల వరుస నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. ఫారెస్ట్‌ బీట్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ పోస్టులకు దాదాపు 1,17,958 మంది దరఖాస్తు చేసుకోగా.. 100 ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు 19,568 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సెప్టెంబర్ 7వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ప్రిలిమినరీ రాత పరీక్షలు జరగనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 287 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. త్వరలో విడుదల చేసే 20 నోటిఫికేషన్లలో తక్కువ పోస్టులున్నాయని, వీటన్నింటికీ కలిపి ఒకేసారి ఉమ్మడి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల తుది ఫలితాల జాప్యంపై కూడా ఆయన మాట్లాడారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నుంచి స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల తుది జాబితా ఇంకా అందకపోవడం వల్ల గ్రూప్స్‌ ఫలితాల్లో జాప్యం నెలకొన్నట్లు పేర్కొన్నారు. ఆ జాబితా అందిన వెంటనే ఫలితాలను విడుదల చేస్తామన్నారు. ఇక గ్రూప్ 2కు సంబంధించి 1634 మంది అభ్యర్థుల కంటిచూపు, 24 మంది వినికిడి సామర్థ్యానికి సంబంధించిన వైద్య నివేదికలు కూడా రావాల్సి ఉందన్నారు. పైగా హైకోర్టులోనూ ఈ పోస్టుల భర్తీకి సంబంధించి వివాదం నడుస్తున్నందున.. తీర్పు వెలువడిన తర్వాత అన్ని పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.