APPSC Group 2 Mains Exam Today: మరికాసేపట్లో గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం.. వెనక్కి తగ్గని అభ్యర్ధులు?

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఏపీపీఎస్సీ అధికారులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ అభ్యర్ధులు మాత్రం పరీక్షలు వాయిదా వేయాల్సిందేనంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నేడు పరీక్షలు జరుగుతాయో? లేదో? అన్న సందిగ్ధం నెలకొంది..

APPSC Group 2 Mains Exam Today: మరికాసేపట్లో గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం.. వెనక్కి తగ్గని అభ్యర్ధులు?
APPSC Group 2 Mains Exam

Updated on: Feb 23, 2025 | 6:36 AM

అమరావతి, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం (ఫిబ్రవరి 23న) జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు అభ్యర్ధులు పరీక్ష వాయిదా వేయాల్సిందేనంటూ నిరసనలు కొనసాగిస్తుంటే.. మరో వైపు ఏపీపీఎస్సీ అధికారులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం జరిగిన నాటకీయ పరిణామాల మధ్య అభ్యర్ధుల విన్నపం మేరకు పరీక్ష వాయిదా వేయాలని ప్రభుత్వం లేఖ రాసినా.. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసిన వారని, వాయిదా వేస్తే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన అవుతుందని, ఆదివారం యథావిథిగా పరీక్ష నిర్వహించేందుకే ఏపీపీఎస్సీ మొగ్గుచూపింది. అయితే ఏపీపీఎస్సీ వైఖరి పట్ల కొందరు అభ్యర్థులు మండిపడుతున్నారు. పరీక్ష వాయిదా వేయాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

గ్రూప్‌ 2 ప్రధాన పరీక్ష ఇప్పటికే ఓసారి వాయిదా పడింది. ఇప్పుడు పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నవారిలో చాలామంది మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించలేదు. ఎలాగైనా నోటిఫికేషన్‌ను రద్దు చేయించి, భవిష్యత్తులో ఇవ్వబోయే నోటిఫికేషన్లో అవకాశం పొందాలని చూస్తున్నారు. గ్రూప్‌ 2 నోటిఫికేషన్లో ఎక్కడా రోస్టర్‌ పాయింట్ల ప్రస్తావనే లేదు. హైకోర్టు విచారణలో మెయిన్స్‌ పరీక్షను నిలువరిస్తే పలువురు అభ్యర్థులకు పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని కమిషన్‌ అభిప్రాయపడింది. షెడ్యూల్‌ ప్రకారం ప్రధాన పరీక్ష నిర్వహించకపోతే.. ఇప్పటికే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న 84,921 మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్‌ ఆధారంగా జరిగే తదుపరి ప్రక్రియను నిలువరించడానికి హైకోర్టు నిరాకరించింది. అయినా అభ్యర్ధులు పరీక్ష వాయిదా వేయాలని శుక్రవారం, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. అయితే శనివారం రాత్రి చివరివరకు పరీక్ష వాయిదా పడుతుందన్న ఆశతో ఉన్నవారు ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని తేల్చిచెప్పడంతో.. దూరప్రాంతాల్లో ఉన్న పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు.

కాగా ఏపీపీఎస్సీ నిర్ణయం మేరకు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్ష కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష జరగనుంది. గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ పరీక్షలో మొత్తం 92,250 మంది మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించారు. వీరందరికీ ఈ రోజు పరీక్ష జరగనుంది. మొదటి సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్‌ 1 పరీక్ష, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది. మరోవైపు ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఏపీపీఎస్సీ పేర్కొంది. అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిషన్‌ కార్యదర్శి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.